Jammu Kashmir Mystery Deaths : జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలో గత 45 రోజుల వ్యవధిలో 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, వికారం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో బధాల్ గ్రామ ప్రజలు స్థానిక ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడి కొద్ది రోజుల తర్వాత మరణిస్తున్నారు. దీంతో ఏదో అంతుచిక్కని వ్యాధి ప్రబలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే చండీగఢ్‌లోని పీజీఐమర్ సంస్థ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) వంటి వివిధ సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగినప్పటికీ మరణాలకు గల కారణం తెలియరాలేదు. ఇటీవల మరో మహిళ ఆస్పత్రిలో చేరడం వల్ల జిల్లా వైద్యాధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు పోలీసుల సహకారాన్ని వైద్యాధికారులు తీసుకుంటున్నారు.
అప్పటి నుంచి ఊర్లోనే!
గ్రామంలో ముందు జాగ్రత్త చర్యలను కూడా తీసుకొంటున్నారు వైద్యులు. డిసెంబరు 7వ తేదీ నుంచి ఊరిలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ముందు జాగ్రత్త చర్యలపై కౌన్సెలింగ్ చేస్తున్నారు. మరో 8 నుంచి 10 రోజుల్లోగా అంతుచిక్కని మరణాలకు సంబంధించిన వివరాలు బయటికి వస్తాయని వైద్యులు తెలిపారు. శాంపిళ్లు స్వీకరించామని చెప్పారు.
కేంద్ర బృందం ఏర్పాటు
అదే సమయంలో మిస్టరీ మరణాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణమే కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హోంశాఖకు చెందిన సీనియర్ అధికారి ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వ్యవసాయశాఖ, ఎరువులు, రసాయనాల శాఖ, జలవనరుల శాఖకు చెందిన నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. వీరికి పశుపోషణ, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్, ఫుడ్ సేప్టీ అధికారులు సహకరిస్తారు.
బాధితులకు తక్షణ సాయం అందించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కసరత్తు చేస్తుందని హోం మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తరహా ఘటనలపై అధ్యయనం చేసేందుకు దేశంలోని అత్యంత ప్రముఖ సంస్థల నుంచి నిపుణులను కూడా కేంద్రం సిద్ధం చేసింది. స్థానిక అధికారులతో కలిసి ఆదివారం దర్యాప్తు ప్రారంభించింది. మొత్తానికి కశ్మీర్లో మిస్టరీ మరణాలపై మరింత అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.