తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం -పై చేయి ఎవరిదో? - Jammu and Kashmir Elections 2024

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడం వల్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఓటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Jk Election 2024 Counting
Jk Election 2024 Counting (ETV Bharat, ANI)

Jk Election 2024 Counting:జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడం వల్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం 90 స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోగా, బీజేపీ, పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ ప్రభుత్వమే వస్తుందని అంచనా వేశాయి. ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ ఎన్​సీ, పీడీపీ పార్టీలు స్పష్టం చేశాయి.

మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో 873 మంది అభ్యర్థులు పోటీచేశారు. 370 అధికరణం రద్దయ్యాక తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో పోలింగ్‌ శాతం 65.52 నమోదైతే, ఈసారి 63.45 శాతానికే పరిమితమైంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్ అబ్దుల్లా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా బటమాలూ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

హంగ్​ అసెంబ్లీకే ఛాన్స్
దాదాపు పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మెజారిటీ మార్క్‌ చేరుకోదని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్- కాంగ్రెస్‌ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు దక్కించుకోవడం కష్టమని అంచనా వేశాయి. బీజేపీకి కనిష్ఠంగా 20 గరిష్ఠంగా 32 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. పీడీపీ పార్టీ సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కానుందని సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

తెరపైకి నామినేట్ ఎమ్మెల్యేల అంశం
జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఫలితాల వేళ నామినేట్‌ ఎమ్మెల్యేల అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర హోంశాఖ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్‌ ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్‌ చేస్తారు. జమ్ముకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 2019ను అనుసరించి ఈ నియమాకాలు చేపట్టనున్నారు. 2023 జులైలో ఈ చట్టాన్ని మరోసారి సవరించారు. కశ్మీర్‌ పండిట్లు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చిన శరణార్థులు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలుగా నియమితులవుతారు. 90 సీట్లున్న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేల నియామకంతో మెజారిటీ మార్కు 48కి చేరనుంది. ఈ ప్రక్రియను కాంగ్రెస్‌, ఎన్​సీ, పీడీపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు వీరిని నియమించడమంటే ప్రజల తీర్పును కాలరాసినట్లే అవుతుందని జేకే పీసీసీ అధికార ప్రతినిధి రవీందర్‌ శర్మ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మాత్రమే నామినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కేంద్రం ముందుకు వెళ్తే తాము సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని ఎన్​సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టంచేశారు.

2014లో జరిగిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాకపోవడంతో భాజపా, పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగాయి.

ABOUT THE AUTHOR

...view details