గందేర్‌బల్‌లోనూ ఒమర్ అబ్దుల్లా విజయం
- జమ్ముకశ్మీర్‌లోని గందేర్‌బల్ నియోజకవర్గంలోనూ గెలుపొందిన నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా
- ఇప్పటికే బుడ్గాం స్థానంలో విజయం సాధించిన ఒమర్ అబ్దుల్లా
Published : Oct 8, 2024, 6:51 AM IST
|Updated : Oct 8, 2024, 3:59 PM IST
JK Assembly Election Results :జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల ఇక్కడి 90 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 63.45 శాతం పోలింగ్ నమోదైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల జమ్ముకశ్మీర్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ, పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. అయితే, ఇక్కడ ఐదుగురుఎమ్మెల్యేలను ఎల్‌జీ నామినేట్ చేయనున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు 48కి చేరనుంది. కాగా, జమ్ముకశ్మీర్‌లో ఏ పార్టీ ఈ మార్కును అందుకోలేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
LIVE FEED
గందేర్‌బల్‌లోనూ ఒమర్ అబ్దుల్లా విజయం
జమ్ముకశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ బోణీ కొట్టింది. చరిత్రలో తొలిసారి అక్కడ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందింది. దోడా నియోజకవర్గం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేసిన మెహ్రాజ్ మాలిక్- బీజేపీ అభ్యర్థిపై గజయ్ సింగ్ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
జమ్ముుకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి అధికారం కైవసం చేసుకుంది. మేజిక్ ఫిగర్ 46 దాటేసింది. ఎన్‌సీ 41 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 6 చోట్ల గెలుపొందింది. మరో స్థానంలో ఎన్‌సీ ఆధిక్యంలో ఉంది. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు.
జమ్ముకశ్మీర్ ఫలితాలపై మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమికి అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పు నుంచి కేంద్ర ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు.
జమ్ముకశ్మీర్ కొత్త సీఎం ఒమర్ అబ్దుల్లానే అని ఆయన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. భారీ భద్రత నడుమ 28 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 100 మీటర్లకు ఒక చెక్ పాయింట్ ఏర్పాటు చేశామని, అన్ని స్ట్రాంగ్ రూముల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గుర్తింపు లేని వ్యక్తులను ఈ ప్రాంతంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, ఆ తర్వాత ఈవీఎం ఓట్లు కౌంట్ చేస్తామని తెలిపారు. ఇక కౌంటింగ్ ప్రక్రియను మానిటర్ చేయడానికి ఎన్నికల సంఘం కొందరు పరిశీలకులను నియమించింది.
ఓట్ల లెక్కింపు కోసం జమ్ముకశ్మీర్‌లోని 20 కౌంటింగ్ కేంద్రాల వద్ద, జిల్లా ప్రధాన కార్యాలయాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లెక్కింపు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.