Jammu Kashmir Second Phase Election :జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు వేళైంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్‌బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
గందర్‌బల్, బుద్గాం స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు. సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో హమీద్ కర్రా, నౌషెరా స్థానంలో రవిందర్ రైనా బరిలో నిలిచారు. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 3502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. వాటిలో 1,056 పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో, 2,446 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
జైలు నుంచి వేర్పాటువాద నేత పోటీ
ఈ దఫా ఎన్నికల్లో బీర్వా, గందర్‌బల్ సెగ్మెంట్లపై ఆసక్తి నెలకొంది. జైలులో ఉన్న వేర్పాటువాద నాయకుడు సర్జన్ అహ్మద్ వాగే అలియాస్ బర్కతి- ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేయడమే అందుకు కారణం. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లాను రెండు లక్షలకుపైగా మెజార్టీతో ఓడించిన ఇంజినీర్ రషీద్ ఫీట్‌ను పునరావృతం చేయాలని బర్కతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజినీర్ రషీద్ తిహాడ్ జైలు నుంచి పోటీ చేసి బారాముల్లాలో విజయం సాధించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గందర్‌బల్ నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లాను ఓడించాలని బర్కతి భావిస్తున్నారు.