ISRO Chief Somanath Cancer : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారినపడ్డినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన 'ఆదిత్య - ఎల్1' ప్రయోగం చేపట్టిన రోజే ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు ఇటీవలే ఓ మలయాళం వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
షాక్‌లో కుటుంబ సభ్యులు
చంద్రయాన్ -3 ప్రయోగం సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు సోమనాథ్ చెప్పారు. ' ఆ సమయంలోనే దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు. కానీ, ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నా. కడుపులో ఏదో సమస్య ఉన్నట్లు తెలిసింది. ప్రయోగం పూర్తి కాగానే చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్లు చేయించా. నా కడుపులో కణితి పెరిగిందని అప్పుడే నాకు తెలిసింది. ఆ తర్వాత 2,3 రోజులకు అది క్యాన్సర్ అని నిర్ధరణ అయింది. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు సహోద్యోగులు షాక్‌కు గురయ్యారు' అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
నాలుగు రోజులు ఆస్పత్రిలోనే
అయితే తనను ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని సోమ్‌నాథ్ తెలిపారు. '2023 సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నా. అలా మొత్తంగా నాలుగు రోజులే ఆసుప్రతిలో ఉండి క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నా. ఐదో రోజు నుంచి ఇస్రోలో రోజువారీ పనులకు వెళ్లాను. మొదట్లో కాస్త కంగారు పడినప్పటికీ క్యాన్సర్‌కు పూర్తి పరిష్కారంగా చిక్సిత ఉందన్న విషయంపై ఇప్పుడు అవగాహన వచ్చింది' అని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు.