తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎవరు తప్పు చేసినా వదలిపెట్టం- విద్యార్థుల విషయంలో పాలిటిక్స్ వద్దు: ధర్మేంద్ర ప్రధాన్‌ - NEET Row

Dharmendra Pradhan On NEET Row : నీట్‌ పరీక్ష వ్యవహారంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు.

Dharmendra Pradhan On NEET Row
Dharmendra Pradhan On NEET Row (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 9:45 PM IST

Dharmendra Pradhan On NEET Row : వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరణ ఇచ్చారు. పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని తెలిపారు. నీట్‌ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అధికారులపై కఠిన చర్యలు!
పరీక్షలో అవకతవకలపై బిహార్‌ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అవసరమైతే నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహణే తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదన్నారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించబోమని చెప్పారు. విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్‌-యూజీ. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వల్ల వీటిని కలిపారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవడం, నీట్‌ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

డార్క్‌నెట్‌లో పరీక్ష పేపర్ లీక్!
మరోవైపు, జూనియర్ రీసెర్చ్ ఫెలోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్‌డీ స్కాలర్స్‌ ఎంపికకు నిర్వహించే యూజీసీ- నెట్ పరీక్షను రద్దు చేయడంపై కేంద్ర మంత్రి స్పందించారు. డార్క్‌నెట్‌లో పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పారు. మన వ్యవస్థలపై విశ్వాసం ఉంచుదామని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి అక్రమాలను, అవకతవకలను సహించదని చెప్పారు. మరోవైపు నెట్ పరీక్ష పేపర్ లీక్​పై సీబీఐ కేసు నమోదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details