Indias Got Latent Controversy : ఇండియాస్ గాట్ లేటెంట్ షోపై సాగుతున్న వివాదంలో మరో కీలక పరిణామం. తమ వాంగ్మూలాలను రికార్డు చేయాలంటూ యూట్యూబర్లు ఆశిష్ చంచ్లాని, రణవీర్ అలహాబాదియా సోమవారం మహారాష్ట్ర సైబర్ సెల్‌ను సంప్రదించారు.
యూట్యూబ్‌లో ప్రజలకు అందుబాటులో ఉండే ఇండియాస్ గాట్ లేటెంట్ షో వేదికగా లైంగిక సంబంధాలపై అభ్యంతరకర, అశ్లీల వ్యాఖ్యలు చేశారనే అభియోగాలను వారిద్దరు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ ఎదుట విచారణకు రావాలంటూ ఆశిష్, రణవీర్‌కు మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగం సమన్లు పంపింది. ఈ కేసుపై వాంగ్మూలాలను ఇవ్వాలని సూచించింది. తప్పకుండా సహకరిస్తామని బదులిచ్చారని మహారాష్ట్ర సైబర్ సెల్ వెల్లడించింది.
ఇండియాస్ గాట్ లేటెంట్ షోతో సంబంధమున్న సమయ్ రైనా, అపూర్వ ముఖిజ సహా పలువురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. "ఈ కేసులో ఇప్పటివరకు 42 మందికి సమన్లు పంపాం. ఈ జాబితాలో ఇండియాస్ గాట్ లేటెంట్ షోలోని ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు" అని మహారాష్ట్ర సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ యశస్వి యాదవ్ తెలిపారు. దేవేశ్ దీక్షిత్, రఘు రాం వాంగ్మూలాలను ఇప్పటికే రికార్డు చేసినట్లు చెప్పారు.
రణవీర్ అలహాబాదియా అతిథిగా హాజరైన తర్వాత ఇండియాస్ గాట్ లేటెంట్ షో వివాదాస్పదంగా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. రణవీర్, సమయ్ రైనా, అపూర్వ ముఖిజ, షో నిర్వాహకులకు వ్యతిరేకంగా ముంబయి పోలీసు కమిషనర్, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి.
సుప్రీంకోర్టు మండిపాటు
ఫిబ్రవరి 18న ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. రణవీర్ అలహాబాదియా వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. రోత వ్యాఖ్యలు, అశ్లీల వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం మండిపడింది. అలాంటి వ్యాఖ్యలను ఏ మాత్రం సంకోచం లేకుండా ఖండించాల్సిందే అని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ అభ్యంతరకర ఎపిసోడ్‌లను ఇండియాస్ గాట్ లేటెంట్ షో నిర్వాహకుడు సమయ్ రైనా తొలగించారు.