India Commissions INS Arighat :భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్ (INS Arighaat)ను భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖ తీరంలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ అణు జలాంతర్గామిలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు మన శక్తిసామర్థ్యాలకు, శాస్త్రజ్ఞుల ప్రతిభకు నిదర్శనమన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఇది కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఐఎన్‌ఎస్ అరిఘాత్ భారత నౌకాదళంలో చేరిన రెండో అణు జలాంతర్గామి కావడం విశేషం. ఇప్పటికే 'ఐఎన్‌ఎస్ అరిహంత్' తన సేవలు కొనసాగిస్తోంది.
ఐఎన్‌ఎస్ అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులోని ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో 2011 డిసెంబరులో చేపట్టారు. తొలిదశ నిర్మాణం తర్వాత 2017 నవంబరు 19న జలప్రవేశం చేయించారు. అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేశారు. సీ ట్రయల్స్ ప్రక్రియను పలు దఫాలుగా చేపట్టారు.
ఐఎన్ఎస్ అరిఘాత్ విశేషాలివే!
ఈ ఐఎన్ఎస్ అణు జలాంతర్గామి పొడవు 111.6 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు. డ్రాఫ్ట్ (లోతు) 9.5 మీటర్లు. ఈ సబ్మెరీన్ సముద్ర ఉపరితలంలో గంటకు 12-15 నాటికల్ మైళ్లు (22 కి.మీ నుంచి 28 కి.మీ) వేగంతో పయనిస్తుంది. అదే సముద్ర జలాల్లో అయితే 24 నాటికల్ మైళ్ల వేగంతో వెళుతుంది.