Ilaiyaraaja Songs Controversy: కాపీ రైట్ గడవు ముగిసినా ఇంకా తన పాటలను వాడుకుంటున్నారంటూ మ్యూజిక్ కంపెనీలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మద్రాస్ హైకోర్టు వాయిదా వేసింది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీలైన ఎకో, ఏఐజీ కంపెనీలు కాపీ రైట్ గడువు ముగిసినా తన అనుమతి లేకుండా పాటలను వాడుకుంటున్నాయని ఇళయరాజా కోర్టులో దావా దాఖలు చేశారు. దీనిపై పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని అంటూ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇళయరాజా స్వర పరిచిన 4,500 పాటలను ఉపయోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ పాటలకు చేసుకున్న ఒప్పందం ముగిసిన తర్వాత కూడా కాపీరైట్ పొందకుండా తన పాటలను ఉపయోగిస్తున్నారని ఇళయరాజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించి మద్రాసు హైకోర్టు, నిర్మాతల నుంచి హక్కులను పొందిన తర్వాత ఇళయరాజా పాటలను వినియోగించుకునే హక్కు సంగీత సంస్థలకు ఉంటుందని, ఇళయరాజాకు కూడా వ్యక్తిగతంగా హక్కు ఉంటుందని 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును ఇళయరాజా సవాల్ చేశారు. ఆ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు ఆర్. మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇళయరాజా పాటలను ఉపయోగించకుండా మ్యూజిక్ కంపెనీలపై మధ్యంతర నిషేధం విధించింది.
'నిర్మాతకే హక్కులు ఉంటాయి'
అనంతరం సినిమా కాపీరైట్ నిర్మాత వద్ద ఉందని, వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాటలు ఉపయోగించడానికి అధికారం ఉందని ఎకో తరఫున అప్పీల్ చేశారు. సంగీతం అందించినందుకు ఇళయరాజాకు నిర్మాత డబ్బులు చెల్లించారని, అందుకే రైట్స్ నిర్మాతకే దక్కుతాయని కంపెనీల తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. నిర్మాతకే హక్కులు ఉంటాయని వాదించారు. అందుకు ఇళయరాజా తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్, ఈ వాదనను తిరస్కరించారు. మ్యూజిక్ కంపోజిషన్ అనేది క్రియేటివ్ వర్క్, కాపీరైట్ చట్టం వర్తించదని అన్నారు.