IIT Jodhpur Vehcle Technology :రహదారిపై ప్రమాదాలు తగ్గించే దిశగా, రోడ్డు రవాణాలో విప్లవాత్మక మార్పులు తెచ్చే విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జోధ్‌పుర్ అధునాతన సాంకేతికత రూపొందించింది. రోడ్డుపై ప్రయాణించే వాహనాల మధ్య కమ్యూనికేషన్ నెలకొల్పేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. 'నోవెల్ ఎంఏసీ బేస్డ్ ఆథెంటికేషన్ స్కీమ్' (నోమాస్- NOMAS) సాంకేతికతను తయారు చేసి వాహనాల్లో ఇన్స్టాల్ చేసింది.
ఐఓవీ (ఇంటర్నెట్ ఆఫ్ వెహికిల్) ఆధారితంగా పని చేసినప్పటికీ ఈ డివైజ్‌లోని డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని ఆవిష్కర్తలు చెబుతున్నారు. ఐఐటీ జోధ్‌పుర్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.దేబాశిష్ దాస్, పీహెచ్డీ విద్యార్థి హిమాని సికార్వార్ ఈ సాంకేతికత అభివృద్ధిపై పని చేశారు. వీరు చేసిన ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు 'ఐఈఈఈ- ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్'లో ప్రచురితమయ్యాయి.
రహదారిపై కదులుతున్న సమయంలో వాహనాల మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుంది. రియల్ టైమ్‌లో వాహనాల మధ్య సమాచార బదిలీ జరుగుతుంది. రోడ్డు స్థితిగతులు ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ జామ్ ఏర్పడిందా? యాక్సిడెంట్లు ఏవైనా జరిగాయా అన్న సమాచారాన్ని పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా జరగబోయే ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో ఇలాంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. కానీ భారత్‌లో ఇలాంటి సాంకేతికత అందుబాటులో లేదు. భవిష్యత్ కోసం సన్నద్ధతలో భాగంగా ఐఐటీ జోధ్‌పుర్ తాజా పరిశోధన చేపట్టింది.