Husband and wife Fraud in Post Office in AP : ఏపీలోని విన్నకోట సబ్పోస్టాఫీస్లో భారీస్థాయిలో గోల్‌మాల్ జరిగింది. పోస్టాఫీసులో ఉద్యోగస్థులైన దంపతులిద్దరూ ఖాతాదారుల సొమ్ము నుంచి దాదాపు రూ.30 లక్షలు ప్రభుత్వానికి జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నారు. పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం వల్ల చోటుచేసుకున్న ఈ ఘటనపై గుట్టుచప్పుడు కాకుండా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పక్కదారి పట్టిన సొమ్ముని భార్యభర్తల నుంచి రికవరీకి యత్నిస్తున్నారు. ఏపీలో ఏలూరు జిల్లా ముదినేపల్లి పోస్టాఫీసు పరిధిలో ఉన్న విన్నకోట సబ్‌పోస్టాఫీసు పరిధిలో విన్నకోట, కట్టవానిచెర్వు, పురిటిపాడు, చినగొన్నూరు గ్రామాలు ఉన్నాయి.
ఈ బ్రాంచిలో డోకిపర్రుకు చెందిన కాగిత వరుణ్మయి ఏబీపీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. బీపీఎం ఉద్యోగ విరమణ సమయంలో ఆమె బీపీఎంగా విధలు నిర్వహించేవారు. దాదాపు ఇలా రెండుసార్లు పోస్టాఫీసులో బీపీఎంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆమెకు ఈడే రాజాతో వివాహం జరిగింది. నిరుద్యోగి అయిన తన భర్తకు బీపీఎంగా అవకాశం కల్పించాలని ఆమె కోరడంతో డిపార్ట్‌మెంట్ అధికారులు సైతం అంగీకరించి బీపీఎంగా ఉద్యోగం కల్పించారు. 2023 డిసెంబరు నుంచి ఆమె భర్త ఈడే రాజా బీపీఎంగా విధుల్లో చేరాడు. ఈ కార్యాలయంలో ఉన్న రెండు ఉద్యోగాలను భార్యభర్తలిద్దరూ నిర్వహిస్తున్నారు.
పది నెలల్లో రూ.30 లక్షలు స్వాహా : ఈ క్రమంలో పోస్టాఫీసు ఖాతాదారులు, గ్రామస్థులు పెంచుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని భార్యభర్తలిద్దరూ అనుకూలంగా మార్చుకున్నారు. ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌డీ తదితర ఖాతాల్లో జమ చేయాలని ఖాతాదారులు ఇచ్చిన డబ్బును ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా పుస్తకాల్లో మాత్రం నమోదు చేసేవారు. నిరక్షరాస్యులైన వారికి పుస్తకాల్లో కూడా నమోదు చేయలేదని ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇలా దాదాపు పది నెలల్లో పోస్టాఫీసు ఖాతాదారుల ఖాతాల ద్వారా ప్రభుత్వానికి చేరాల్సిన సుమారు రూ.30 లక్షలు వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ బ్రాంచి నుంచి అనేక ఖాతాల్లోని నగదు ఆగిపోవడంతో కొందరు ఖాతాదారులో, అధికారుల్లోనూ సందేహాలు వ్యక్తమయ్యాయి.
దీంతో విచారణ చేపట్టిన అధికారులు పోస్టాఫీస్ ఖాతాదారుల సొమ్ము గోల్‌మాల్ అయినట్లు గుర్తించారు. దీంతో వారిని పక్కన పెట్టి రహస్యంగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అధికారులు ఖాతాదారుల పుస్తకాలను స్వయంగా పరిశీలించగా వారి అకౌంట్ల వివరాలు, రికార్డులోని నగదు భారీగా వ్యత్యాసం కనిపించింది. అయితే పుస్తకాల్లో నమోదు చేసి ముద్ర వేసి ఇచ్చిన వారికి ఎలాంటి నష్టం ఉండదు. ఎలాగైనా ప్రతి ఉద్యోగి బాధ్యులవుతారు. అందుకు వారి జీతాల నుంచి వీటిని మినహాయించి ఖాతాదారులకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పుస్తకాల్లో నమోదు చేయని ఖాతాదారులు మాత్రం నష్టపోతారు. వారికి శాఖాపరంగా ఎలాంటి హామీ ఉండదనే అభిప్రాయం ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.
కాపాడాల్సిన వాడే కాజేశాడు - రైతుల అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని కుచ్చుటోపీ
చిన్న మల్లయ్య పెద్ద ప్లాన్ : ఊరంతా నమ్మితే - ఉన్నదంతా ఊడ్చేసి రూ.2 కోట్లతో జంప్