తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నోటీసులతో ఈసీ రాజకీయం- వాళ్లు యమునా నది నీళ్లు తాగితే నా తప్పు ఒప్పుకుంటా' - KEJRIWAL ON EC NOTICE

ఈసీ నోటీసులపై స్పందించిన కేజ్రీవాల్- తాఖీదులు పంపి రాజకీయాలు చేస్తోందని మండిపాటు

Kejriwal On EC Notice
Kejriwal On EC Notice (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 3:56 PM IST

Kejriwal On EC Notice :యమునా నది కాలుష్యంపై చేసిన వ్యాఖ్యలపై తనకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు పంపి రాజకీయం చేస్తోందని ఆప్​ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈసీ పంపిన నోటీసుల్లో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని అభ్యంతరం తెలిపారు. తాను జీవించి ఉన్నంతకాలం దిల్లీ ప్రజలను కలుషితమైన నీళ్లను తాగనివ్వను అని అన్నారు.

'యమునా నది కాలుష్యంపై ఈసీ నాకు నోటీసులు పంపింది. నోటీసుల్లో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదు. ఇలా నోటీసులు పంపి ఈసీ రాజకీయం చేస్తోంది. కమిషనర్ ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీశారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగం చేయాలనే దానిపై దృష్టి పెడుతున్నారు. భారతదేశ చరిత్రలో ఆయనలాగా ఎన్నికల కమిషన్​ను ఎవరూ పాడుచేయలేదు. కావాలంటే దిల్లీలో ఏదైనా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. నేను మూడు బాటిళ్ల కలుషితమైన నీటిని ఎన్నికల కమిషన్​కు పంపిస్తా. వాటిని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు విలేకర్లు సమావేశంలో తాగండి. అప్పుడు నేను తప్పును ఒప్పుకుంటా' అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు.

'కేజ్రీవాలకు మరో అవకాశం ఇస్తాం'
అంతకుముందు, యమునా నదిలో అమోనియా స్థాయి పెరగడాన్ని, నదిని విషపూరితం చేశారన్న ఆరోపణలతో కలపవద్దని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషపూరితం చేస్తోందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా వివరణ ఇవ్వాలని ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. యమునా నది అంశంపై బుధవారం కేజ్రీవాల్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం ఈ మేరకు పేర్కొంది. అందులో భాగంగా యమునా నదిలో ఎక్కడ విషం కలిపారు? అది ఏ మోతాదులో, ఏ రూపంలో ఉంది? అనే వివరాలు తెలపాలని సూచించింది. దిల్లీ జల్‌ బోర్డు సిబ్బందిలో ఏ ఇంజినీర్లు ఈ అంశాన్ని గుర్తించారో పూర్తి వివరాలను జనవరి 31(శుక్రవారం) ఉదయం 11 గంటల లోపు చెప్పాలని కేజ్రీవాల్​ను ఈసీ కోరింది. లేని పక్షంలో కమిషన్‌కు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని తేల్చి చెప్పింది.

14 పేజీలతో వివరణ
హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై 14 పేజీల లేఖతో బుధవారం ఎన్నికల సంఘానికి కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. హరియాణా నుంచి దిల్లీకి వస్తున్న యమునా నది జలాలు ఇటీవలి కాలంలో చాలా వరకు కలుషితం అయ్యాయని, విషపూరితంగా ఉన్నాయని చెప్పారు. ఆ నీరు తాగితే మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, మరణాలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. కేజ్రీవాల్ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ ఆధారాలతో సహా పూర్తి వివరాలు చెప్పాలని నోటీసులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details