How Votes Are Counted :దేశంలో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? విధివిధానాలేంటి? కౌంటింగ్ కేంద్రంలో ఎన్ని టేబుల్స్ ఉంటాయి? పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఎప్పుడు లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈసీ కౌంటింగ్ చేపడుతుంది. అందులో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారుల కోసం ప్రత్యేక హ్యాండ్ బుక్‌ను రూపొందించింది. అందులో ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961లో పొందుపరిచిన 66ఏ రూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు సమయం, కౌంటింగ్ కేంద్రం, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, తొలగింపునకు సంబంధించిన విషయాలు ఈ నింబంధనలు తెలియజేస్తాయి.
రిటర్నింగ్ అధికారి
నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేది ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ప్రతి అసెంబ్లీ/ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రిటర్నింగ్ అధికారిని ఈసీ నియమిస్తుంది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కూడా ఉంటాయి. వారికి చట్టబద్ధమైన అధికారాలు ఉంటాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961లోని రూల్ 51 ప్రకారం రిటర్నింగ్ అధికారి నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థికి లేదా వారి ఎన్నికల ఏజెంట్‌కు పోలింగ్ తేదీకి కనీసం ఒక వారం ముందు, ఓట్ల లెక్కింపు తేదీ, సమయం, పోలింగ్ కేంద్రం గురించి లిఖితపూర్వకంగా తెలియజేయాలి.
కౌంటింగ్ కేంద్రాలు
ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కౌంటింగ్ హాల్లు ఉన్న కేంద్రాల్లో జరుగుతుంది. దాదాపుగా ఈ కౌంటింగ్ కేంద్రాలు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఉంటాయి. కొన్నిసార్లు సబ్ డివిజన్లో ఉండొచ్చు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఒకే చోట జరుగుతుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల ఫలితాలను వేర్వేరు చోట్ల లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ హాల్‌లో ఈవీఎం కంట్రోల్ యూనిట్ కోసం 7-14 కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయి. వాటితో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి మరో టేబుల్ అదనంగా ఉండాలి.
ఒడిశా వంటి చోట్ల పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాయి. అందుకే అక్కడ ఏడు టేబుళ్లను అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు, మిగతావి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు ఉపయోగించనున్నారు. కౌంటింగ్ టేబుళ్ల వద్ద ఏజెంట్లు ఏజెంట్లు కూర్చుని లేదా నిలబడి ఉంటారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థుల పేర్లు, బ్లాక్ బోర్డ్, టీవీ ఉంటుంది. పరిశీలకుల ధ్రువీకరణ తర్వాత రౌండ్ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక్కొ టేబుల్‌కు ఒక్కొ మైక్రో అబ్జర్వర్ ఉంటారు.