Himachal Pradesh Politics :రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో హస్తం పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాషాయదళం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చర్యలు ప్రారంభించింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెలేలతో చర్చలు జరిపేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతోపాటు డీకే శివకుమార్‌ను పరిశీలకులుగా నియమించింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు వారిద్దరూ బుధవారం ఉదయం శిమ్లా చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
హరియాణాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్ (క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ) ఎమ్మెల్యేలు శిమ్లా నుంచి హరియాణాకు వెళ్లారు. వారంతా బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హరియాణాలోని పంచకులాలోని గెస్ట్‌హౌస్ బయట ఓ కాన్వాయ్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ శర్మ, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.
గవర్నర్‌ను కలిశాక!
అసెంబ్లీ సమావేశాలకు ముందు బుధవారం ఉదయం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీజేపీ కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిందని పేర్కొంటూ జై రాం ఠాకుర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలుస్తారని తెలుస్తోంది. అనంతరం సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.