High Court Order On Husband Wife Issue :విడాకులు తీసుకున్న భార్య, దివ్యాంగ కుమారుడికి నెలవారీ పోషణార్థం డబ్బులు ఇవ్వని వ్యక్తి ఆస్తిని జప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. మహిళకు, ఆమె కుమారుడికి ఆమె భర్త నెలవారీ భరణం చెల్లించని క్రమంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మహిళ భర్తపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది జస్టిస్ అను శివరామన్, జస్టిస్ అనంత్ రామనాథ్ హెగ్డేలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం. విచారణ సందర్భంగా 2012 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మహిళకు, ఆమె కుమారుడికి నెలకు రూ.5000 చొప్పున పోషణార్థం డబ్బులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూరులోని ఉత్తరాహల్లిలో మహిళ భర్తకు ఉన్న 1,276 చదరపు అడుగుల ఇల్లును జప్తు చేయాలని ఆదేశించింది. భర్త ఇతర ఆస్తి వివరాలు మహిళ అందిస్తే వాటిని కూడా జప్తు చేస్తామని పేర్కొంది. గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మహిళ భర్త పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే ఆస్తి బదిలీ చట్టం 1882 లోని సెక్షన్ 39 ప్రకారం భర్త ఆస్తిలో కొంత భాగాన్ని మహిళ, ఆమె కుమారుడికి వస్తుందని పేర్కొంది.
ఇదీ కేసు
2002లో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది ఓ మహిళ. అప్పటికే ఆమెకు ఓ దివ్యాంగ కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆమె తనకు, కుమారుడికి నెలకు కొంతమేర నగదును పోషణార్థం ఇవ్వమని కోరింది. దీంతో మహిళ భర్త ఆమెకు నెలకు రూ.2వేలు, దివ్యాంగ కుమారుడికి రూ.1000 ఇచ్చాడు. ఆమె మళ్లీ పదేళ్ల తర్వాత(2012) ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు పోషణార్థం ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్ ఫ్యామిలీ కోర్టు ఒక్కొక్కరికి నెలకు రూ.3వేలు ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత పోషణార్థం ఇచ్చే నగదును పెంచాలని, పాత బకాయిలు చెల్లించలేదని మహిళ కర్ణాటక హైకోర్టులో కొన్నాళ్ల క్రితం పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన హైకోర్టు, మహిళ, ఆమె దివ్యాంగ కుమారుడికి పోషణార్థం నెలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించింది.
'ఆ హక్కును కోల్పోరు'
భార్య మరణించిన తర్వాత రెండో వివాహం చేసుకున్న వ్యక్తి మొదటి భార్య పిల్లల సంరక్షక హక్కును కోల్పోరని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో అశోక్ పాఠక్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. మౌ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోమని పేర్కొంది.