Jharkhand Election Hemant-Kalpana :ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి విజయంలో సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ కీలక పాత్ర పోషించారు. భూ వివాదానికి సంబంధించిన కేసులో అరెస్టైనా, కీలక నాయకుడు బీజేపీలో చేరినా ధైర్యం కోల్పోకుండా పార్టీని ముందుకు నడిపిన హేమంత్ సోరెన్ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. భర్త జైలులో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన కల్పనా సోరెన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. హేమంత్, కల్పన కలిసి ఏకంగా 200 సభల్లో పాల్గొన్నారు. బంటీ ఔర్ బబ్లీగా పేరొందిన వీరి జోడీ జేఎంఎంను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చింది.
ఎగ్జిట్ పోల్స్ తలకిందులు
ఆదివాసీ కోటలో జేఎంఎం మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈడీ కేసులు మొదలు అరెస్టులు, తిరుగుబాట్లు, ప్రత్యర్థుల వ్యూహాలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొన్న జేఎంఎం - ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు మారుపేరుగా నిలిచిన ఝార్ఖండ్‌లో, ఈసారి స్పష్టమైన మెజార్టీ సాధించిన జేఎంఎం సుస్థిర పాలన దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.
తొలి ఎన్నికల్లో ఓటమి - 38 ఏళ్లకే సీఎం బాధ్యతలు
1975లో జన్మించిన హేమంత్ సోరెన్ ఇంటర్ వరకే చదువుకున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేరినా చదువును మధ్యలోనే వదిలేశారు. 2005లో తొలిసారి దుమ్కా నుంచి ఎన్నికల్లో పోటి చేసిన హేమంత్ పార్టీ రెబల్ అభ్యర్థి స్టీఫెన్ మరాండీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో సోదరుడు దుర్గా మృతితో పార్టీ కీలక బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 2009 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా హేమంత్ పనిచేశారు. ఆ తర్వాత అర్జున్ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో బీజేపీ, జేఎంఎం, జేడీయూ, ఏఎస్‌జేయూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జేఎంఎం మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఆ తర్వాత 2013 జులైలో 38 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టారు సోరెన్. 2014 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్
భూ కుంభకోణం కేసుకు సంబంధించి హేమంత్ సోరెన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారు. అయితే జనవరిలో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేయడానికి ముందే హేమంత్ తన పదవికి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య 2024 ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలల తర్వాత జూన్ 28న హేమంత్ జైలు నుంచి విడుదలయ్యారు. ఝార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా జూలై 4న ప్రమాణ స్వీకారం చేశారు.
సూపర్ హిట్ జోడిగా
హేమంత్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసి బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్, కల్పనాలు కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొన్నారు. బంటీ ఔర్ బబ్లీగా పేరొందిన వీరిద్దరి జోడీ ఝార్ఖండ్ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, జేఎంఎం కూటమి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.