తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 5:24 PM IST

Updated : Mar 12, 2024, 5:56 PM IST

ETV Bharat / bharat

హరియాణా కొత్త సీఎంగా నాయబ్ సైనీ ప్రమాణస్వీకారం

Haryana New CM Oath Ceremony : హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో మంగళవారం సాయంత్రం ఆయనతో గవర్నర్​ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు.

Etv Bharat
Etv Bharat

Haryana New CM Oath Ceremony :లోక్​సభ ఎన్నికలకు ముందు హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీ(54) ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. చంఢీగఢ్​లోని రాజ్​భవన్​లో మంగళవారం సాయంత్రం ప్రమాణస్వీకారం జరిగింది.

నాయబ్​ సైనీతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో బీజేపీ నేతలు కన్వర్ పాల్, మూల్ చంద్ శర్మ, జై ప్రకాష్ దలాల్, బన్వారీ లాల్​తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌతాలా ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఖట్టర్‌కు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు నాయబ్ సైనీ.

స్వతంత్రుల మద్దతుతో సొంతంగా!
ఇప్పటి వరకు దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ-JJPతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ, ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోక్‌సభ సీట్ల సర్దుబాటుపై విభేదాలతో జేజేపీతో పొత్తుకు బీజేపీ స్వస్తి పలికింది. జేజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఖట్టర్ రాజీనామాతో!
అంతకుముందు ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పదవికి రాజీనామా చేయడం వల్ల రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే పలువురు నేతల పేర్లు తెరపైకి రాగా చివరకు నాయబ్‌ సైనీ వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఈయన ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు.

కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా
ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణ్‌గఢ్‌ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఏకంగా 3.83 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.

అందుకే నాయబ్​కు పగ్గాలు
గతేడాది అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు సైనీ. హరియాణా ఓబీసీల్లో సైనీల జనాభా దాదాపు 8 శాతం. కురుక్షేత్ర, హిస్సార్‌, అంబాలా, రేవాడీ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.

లోక్​సభకు ఖట్టర్ పోటీ
అంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్ర పక్షం జేజేపీతో విభేదాలు తలెత్తడం వల్లే మనోహర్ లాల్​ అధికార పీఠం నుంచి దిగిపోయినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కర్నాల్‌ ఎంపీ స్థానం నుంచి ఖట్టర్‌ పోటీ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Last Updated : Mar 12, 2024, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details