Gujarat Accident Today :గుజరాత్ ఖేడా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది మరణించారు. బుధవారం నడియాడ్ పట్టణం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ వేపై పార్క్ చేసిన ట్రక్కుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. అతివేగం కారణంగా అదుపుతప్పి ముందు పార్క్ చేసిన ట్రక్కు వెనుక భాగంలోకి కారు చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది చనిపోయినట్లు నడియాడ్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కిరీట్ చౌదరి తెలిపారు. కారు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ట్రక్కును వెనుక నుంచి కారు ఢీకొన్న వెంటనే కారులో ఉన్న 8 మంది చనిపోయారని ఆయన చెప్పారు. మిగతా ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలవడం వల్ల హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించామన్నారు. ఆ తర్వాత వారిద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని ఇన్‌స్పెక్టర్ కిరీట్ చౌదరి వెల్లడించారు.
కారు, ట్రక్కు ఢీ- 10మంది మృతి- ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం - GUJARAT ACCIDENT TODAY
Gujarat Accident Today : గుజరాత్‌లోని ఖేడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10మంది మరణించారు. అహ్మదాబాద్- వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది.
Published : Apr 17, 2024, 5:18 PM IST
|Updated : Apr 17, 2024, 5:58 PM IST
ఎమ్మెల్యే తీవ్ర సంతాపం
ఈ ప్రమాదంపై నడియాడ్ ఎమ్మెల్యే పంకజ్ దేశాయ్ సంతాపం వ్యక్తం చేశారు. "ట్రక్కులో ఏదో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎడమ లేన్‌లో నిలిపి ఉంచారు. కారు వేగంగా ఉండటం వల్ల డ్రైవర్ సకాలంలో బ్రేకులు వేయలేకపోయాడు. దీంతో ట్రక్కును కారు బలంగా ఢీకొట్టింది. అందువల్లే మరణాలు ఎక్కువ సంఖ్యలో సంభవించాయి" అని ఆయన వివరించారు.
భారీగా స్తంభించిన ట్రాఫిక్
కాగా, ఈ ప్రమాదం వల్ల 93 కిలోమీటర్ల పొడవైన అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదం జరిగిన వెంటనే రెండు అంబులెన్సులు, ఎక్స్‌ప్రెస్ హైవే పెట్రోలింగ్ బృందాన్ని ఘటనాస్థలికి పంపించగా సహాయక చర్యలు చేపట్టారు.