Good News for Tirupati Local People:కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. నిత్యం వేలాది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను, ముడుపులను చెల్లించుకుంటారు. వేలసంఖ్యలో ఆ ఏడుకొండల వాడికి తలనీలాలు సమర్పిస్తారు. మరికొద్దిమంది బంగారం, డబ్బులు, ఫోన్లు, వాచీలను హూండీలో వేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
అయితే ఏడుకొండల వాడిని దర్శించుకోవాలంటే దర్శనం టికెట్లు మాత్రమే కాకుండా ట్రైన్, రూమ్ ఇలా అన్నింటిని వేరువేరుగా బుక్ చేసుకోవడం కాస్త ఇబ్బందితో కూడుకున్న అంశం. ఎటు లేదన్నా తిరుమల వెళ్లాలనుకుంటే నెల ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇవేమి లేకుండా నేరుగా స్వామి వారి దర్శనం ఉంటే? నిజమే మీరు విన్నది. తిరుమల స్థానికులు అలాంటి అవకాశాన్నే పొందనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రతి మంగళవారం దర్శనం: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైన తర్వాత తిరుమల స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం ఉంటుందని తిరుపతి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లినట్లు ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా వెల్లడించనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీవాణి, దర్శనాల అవినీతిపై విజిలెన్స్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. తిరుమలలో చిరు దుకాణాదారుల సమస్యలపై ఈవోతో చర్చిస్తానని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు.