Gas Cylinder Safety Tips: వంటగ్యాస్ మనకు చేస్తున్న మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్యాస్ లేదంటే ప్రపంచమే స్తంభించిపోతుందంటే అతిశయోక్తి కాదు. మనుషులకు అంతగా ఉపయోగపడుతున్న గ్యాస్ సిలిండర్.. తేడా వస్తే ప్రాణాలు తీసేస్తుంది. అందుకే.. దీనిని వాడేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలని, ఎలా వాడాలో తెలిసి ఉండాలని నిపుణులు అంటున్నారు. మరి.. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు:సిలిండర్‌ను పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్ అనుకున్న ఏజెన్సీ దగ్గర మాత్రమే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అలాగే సిలిండర్ డెలివరీ అయినప్పుడు కంపెనీ సీల్, సిలిండర్ సరిగ్గా సీల్ చేశారో లేదోనని గుర్తుంచుకోవాలి. సీల్ చిరిగిపోతే దానిని వాడొద్దని సలహా ఇస్తున్నారు. అలాగే సిలిండర్ బరువు కూడా చెక్ చేసుకోవాలి. సిలిండర్ డేట్‌ని చూడాలి. A అంటే జనవరి నుంచి మార్చి వరకూ, B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకూ , C జులై నుంచి సెప్టెంబర్ వరకూ, D అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ అని అర్థం. ఉదాహరణకు D-24 అని ఉంటే ఆ సిలిండర్ 2024 ఏడాదిలో డిసెంబర్ వరకు వినియోగించవచ్చు అని అర్థం. ఈ డేట్ ఎక్స్‌పైర్ అయితే ఆ సిలిండర్ వాడొద్దని సలహా ఇస్తున్నారు.
సిలిండర్ నిల్వ చేసేటప్పుడు:సిలిండర్‌ని ఎప్పుడు కూడా పడుకోబెట్టొద్దని.. నిలబెట్టి ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే సిలిండర్‌ను వేడి, తేమ లేదా సూర్యరశ్మి నుంచి దూరంగా ఉంచాలని చెబుతున్నారు. సిలిండర్‌ను పిల్లలకు అందుబాటులో ఉంచవద్దు. సంవత్సరానికి ఓ సారి రెగ్యులేటర్, గ్యాస్ పైప్‌ను మార్చాలి. ఇవి కేవలం ISI సర్టిఫైడ్‌వి మాత్రమే వాడాలి.