Fraud In CM Samuhik Marriage Scheme : ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టగా మొత్తం బండారం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో మార్చి 5వ తేదీన ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు ఘనంగా పెళ్లి చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అయితే ఆ రోజు ఓ యువతి పథకం ద్వారా వచ్చే సొమ్ము, కానుకల కోసం కక్కుర్తిపడి తన సోదరుడితో ఏడడుగులు నడిచింది. ఆమెకు ఏడాది క్రితమే వివాహం జరగ్గా, ప్రస్తుతం భర్త జీవనోపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.
అయితే సామూహిక వివాహం కింద తన భార్య మళ్లీ పెళ్లి చేసుకున్న విషయాన్ని అతడికి గ్రామస్థులు తెలిపారు. ఫొటోలు కూడా పంపారు. దీంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. అసలు విషయం తెలుసుకోమని స్నేహితులకు పంపాడు. అనంతరం అధికారులకు జరిగిన విషయాన్ని చేరవేశాడు. లక్ష్మీపుర్ అధికారులు దర్యాప్తు చేపట్టి ఆ మహిళ ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరఫున అందించిన వస్తువలన్నీ స్వాధీనం చేస్తుకున్నారు.
"సీఎం వివాహ పథకం కింద అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారని తెలిసి విచారణ చేపట్టాం. అసలు విషయం తెలిసి యువతికి అందజేసిన వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వం అందించే నిధులను నిలిపివేశాం. దీనిపై విచారణ జరుపుతామని డీఎం అనునయ్ ఝా తెలిపారు. ఎవరు తప్పు చేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు" అని లక్ష్మీపుర్ బీడీఓ అమిత్ మిశ్రా తెలిపారు.
రూ.51వేలతోపాటు ఎన్నో కానుకలు!
సీఎం సామూహిక వివాహాల పథకం కింద వివాహం చేసుకున్న జంటలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం రూ.51వేలు ఇస్తోంది. ఆ మొత్తంలో రూ.35వేలను వధువు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మరో రూ.10వేలను బహుమతుల కోసం, రూ.6వేలను వివాహ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇస్తుంది. దీంతోపాటు మంగళసూత్రం, పెట్టె, బట్టలు తదితర కానుకలను అందిస్తుంది.