తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేరుతో ఇండియాలో ఓ గ్రామం- ఎక్కడంటే? - HARYANA VILLAGE IS NAMED CARTERPURI

భారత్‌లోని ఓ గ్రామానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ పేరు - ఎందుకో తెలుసా?

Jimmy Carter
Jimmy Carter (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 1:38 PM IST

Haryana village Is Named Carterpuri :అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. జిమ్మీ కార్టర్‌కు భారత్‌తో అవినాభావ సంబంధం ఉంది. ఆయన పేరుతో హరియాణాలో ఓ గ్రామమే ఉంది. అమెరికా అధ్యక్షుడి పేరిట భారత దేశంలో గ్రామమా? అని ఆశ్చర్యపోకండి. దీని వెనుక ఓ పెద్ద కథ ఉంది. అదేంటంటే?

భారత పర్యటన
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తరువాత భారత్‌లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ సర్కార్ ఏర్పడిన కొద్ది రోజులకే 1978 జనవరి 3న అప్పటి అమెరికా అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్ సతీసమేతంగా భారత్‌లో పర్యటించారు. అందులో భాగంగానే ఆయన దిల్లీకి దగ్గరలో ఉన్న 'దౌలత్పుర్ నసీరాబాద్' అనే పల్లెటూరుకు వెళ్లారు. దీనితో ఆ గ్రామానికి 'కార్టర్‌పురి' అని నామకరణం చేశారు.

జిమ్మీ తల్లి వాలంటీర్‌గా పనిచేసిన గ్రామం!
కేవలం జిమ్మీ కార్టర్‌ పర్యటించినందుకే ఈ పేరు పెట్టలేదు. జిమ్మీ కార్టర్ తల్లి లిలియన్ 1960 చివర్లో హరియాణాలోని దౌలత్పుర్ నసీరాబాద్​లో పీస్ కార్ప్స్‌లో ఆరోగ్య వాలంటీర్‌గా పనిచేశారు. ఇలా అనేక కారణాల వల్ల జిమ్మీ కార్టర్ పేరును 'దౌలత్పుర్ నసీరాబాద్'కు పెట్టారు.

జిమ్మీ కార్టర్ అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం వైట్‌హౌస్, కార్టర్‌పురి మధ్య సంబంధాలు కొనసాగాయి. జిమ్మీ కార్టర్ 2002లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నప్పుడు కార్టర్‌పురి గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. దీనికి చిహ్నంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు జనవరి 3న కార్టర్‌పురిలో సెలవు దినంగా జరుపుకుంటారు. ఈ విధంగా జిమ్మీ కార్టర్ పర్యటన ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసింది.

కీలక వ్యాఖ్యలు
జిమ్మీ కార్టర్‌ ఎప్పుడూ భారత్‌కు మంచి మిత్రుడిగా ఉన్నారు. 1978 జనవరి 3న రాష్ట్రపతి భవన్‌లోని అశోక హాల్‌లో దిల్లీ డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేశారు. అప్పుడే కార్టర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "పౌరులకు సేవ చేయడానికే ప్రభుత్వం ఉంటుంది. అంతేకానీ ప్రజలు చేత సేవలు చేయించుకోవడానికి కాదు.
భారతదేశం ఎన్నో వైవిధ్యాలు కలిగిన దేశం. అయినప్పటికీ రాజకీయ ఐక్యతను సాధించింది. దేశంలోని వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్నప్పటికీ, వారంతా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండడానికి వీలు కల్పించింది." అని అన్నారు.

ఇందిరా గాంధీ హయాంలో ప్రకటించిన ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు కార్టర్. "భారత్ రాజకీయంగా అపురూపమైన విజయాలు సాధించింది. కానీ ఆర్థిక, సామాజిక పురోగతి సాధించాలంటే నిరంకుశత్వాన్ని, నిరంకుశ సిద్ధాంతాలను వదులుకోవాలి. ఒకవేళ నిరంకుశ పాలన ఏర్పడితే అది దేశానికే చేటు తెస్తుంది" అని పార్లమెంట్ సభ్యులతో అన్నారు.

ప్రజాస్వామ్యమే గెలిచింది!
ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోవడం గురించి కూడా జిమ్మీ కార్టర్‌ మాట్లాడారు. "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రజలు చాలా తెలివిగా ఆలోచించారు. తమకు స్వేచ్ఛకు భంగం కలిగించిన ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించారు. ఇది గొప్ప ప్రజాస్వామ్య విజయం" అని వ్యాఖ్యానించారు.

భారత్‌-అమెరికా సంబంధాలు బలోపేతం
1971 భారత్-పాక్ యుద్ధంలో అమెరికా బాహాటంగానే పాకిస్థాన్‌కు మద్దతు పలికింది. దీనితో భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే జిమ్మీ కార్టర్ భారత పర్యటనకు వచ్చారు. ఇది లాంఛనప్రాయంగా మిగలలేదు. ఇరుదేశాల మధ్య పరస్పర గౌరవం, భాగస్వామ్యం, విశ్వాసం పెరగడంలో కీలక భూమిక పోషించింది. జిమ్మీ కార్టర్‌ చేపట్టిన ఆ పర్యటన భారత్-అమెరికా మధ్య మైత్రిని పెంచింది.

ABOUT THE AUTHOR

...view details