Doctors Strike In India : బంగాల్ కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్) తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖను పంపించింది. ఆర్జీ కార్ మెడికల్ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ చర్యను చేపట్టినట్లు ప్రకటించింది.
24 గంటల డెడ్‌లైన్ కూడా!
అయితే, జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోర్డా కేంద్రాన్ని శనివారం డిమాండ్ చేసింది. అందుకు గాను 24 గంటల డెడ్‌లైన్ కూడా ఇచ్చింది. చర్యలు తీసుకోకుంటే ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం జరగాలని పేర్కొంది. ఈ విషయానికి రాజకీయ రంగు పులిమి ప్రతికూల కోణంలో చూడొద్దని అభ్యర్థించింది. అన్ని వర్గాలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది.