Fire Accident In Wedding Ceremony :బిహార్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేశారు. బాణసంచా కాల్చడం వల్ల చెలరేగిన మంటలు వెంటనే సిలిండర్, డీజిల్ స్టాక్‌లోకి వ్యాపించినట్లు సమాచారం. అనంతరం భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది
బహెరా పోలీస్ స్టేషన్‌లోని ఆంటోర్ గ్రామంలో ఛగన్ పాశ్వాన్ కుమార్తె వివాహ వేడుక జరిగింది. వేడుక కోసం టెంట్ ఏర్పాటు చేసి, బస బోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం పెళ్లి ఊరేగింపు వచ్చింది. ఈ క్రమంలో భారీగా బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో టెంట్‌కు నిప్పు అంటుకుంది. దీంతో అక్కడే ఉంచిన సిలిండర్లు, డీజిల్‌కు మంటలు వ్యాపించి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మూడు పశువులు కూడా మరణించాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై దర్భంగా జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ రోషన్ స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు అన్వేషించడానికి ఒక బృందాన్ని కూడా ఘటనాస్థలికి పంపించామని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.