Fire Accident In Kathua :జమ్ముకశ్మీర్‌లోని కఠువాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఊపిరాడక మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాధితులను మాజీ డిప్యూటీ ఎస్పీ అవ్తార్ క్రషన్ రైనా కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు.
కఠువా జిల్లాలోని శివ్‌నగర్ ప్రాంతంలో ఉంటున్న క్రిషన్ (81) ఇంట్లో బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారు నిద్రలో ఉన్నారు. మంటలకు ఇళ్లంతా ఒక్కసారిగా దట్టమైన పొగతో నిండిపోయింది. ఆ పొగలకు వారికి ఊపిరాడలేదు. మంటలను గమనించిన స్థానికులు ఆ ఇంటికి చేరుకుని పది మంది బాధితులను కఠువా ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.
అప్పటికే పది మందిలో ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురికి చికిత్స చేయడం ప్రారంభించారు. మృతులంతా పొగను పీల్చి ఊపిరాడక మరణించారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వైద్యులు తెలిపారు. వారి శరీరంపై ఎలాంటి కాలిన గాయాలు లేవన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదని చెప్పారు. అయితే మృతుల్లో అవ్తార్ క్రిషన్ రైనా, ఆయన కుమార్తె బర్ఖా రైనా (25), కుమారుడు తకాష్ (3) సహా పలువురు ఉన్నారు. క్రిషన్ రైనా భార్య స్వర్ణ పరిస్థితి విషమంగా ఉంది.