Fathers Day 2024 Special Gift : నాన్న.. మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి. తనలోని బాధని మనకు తెలియనీయకుండా తనలోనే దాచుకుంటూ ఇంటిల్లిపాదిని కాపాడుకునే స్ఫూర్తి ప్రధాత. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి తండ్రి దేవుడే! మనకు జీవితాన్నిచ్చేది అమ్మ అయితే.. జీవన విధానాన్ని నేర్పి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలబడేలా చేసే ఆది గురువు నాన్న. అందుకోసం తాను ఎన్ని కష్టాలు పడ్డా సరే.. తన బిడ్డలు సంతోషంగా ఉండాలని అహర్నిశలూ శ్రమిస్తారు. అందుకే అలాంటి తండ్రిని గౌరవిస్తూ ఓ పండగ చేసుకుంటారు. అదే.. ఫాదర్స్ డే(Fathers Day 2024).
ఏటా.. జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ ఏడాది(2024) జూన్ 16న వస్తోంది. మరి మీ ప్రియమైన తండ్రి కోసం బహుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అయితే, ప్రతిసారిలా కాకుండా ఈసారి ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వైద్య పరీక్షలు చేయించండి. ఈ ఫాదర్స్ డే రోజున మీ సంతోషాన్ని వారితో ఇలా పంచుకోండి.
హైబీపి :ఫాదర్స్ డే రోజున మీ నాన్న ఆరోగ్యం కోసం ముందుగా బీపీ చెకప్ చేయించండి. ఎందుకంటే.. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎలాంటి లక్షణాలు చూపించకుండానే శరీరం లోపల సమస్యల్ని సృష్టిస్తుంది. అంతేకాదు.. దీనికి ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే స్ట్రోక్స్కి దారి తీస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. కేవలం నార్మల్ టెస్ట్‌తో బీపీ ఉందో లేదో ఈజీగా గుర్తించొచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులు, ధూమపానం, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
డయాబెటిస్ టెస్ట్ :మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో డయాబెటిస్ సమస్య వేధిస్తోంది. కాబట్టి, దీని బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు తరచుగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కాబట్టి, మీ నాన్న ఆరోగ్యం కోసం ఓసారి డయాబెటిస్ టెస్ట్ చేయించండి. ఎందుకంటే ఇది బాడీలో ఉన్నట్లయితే తగిన చికిత్స తీసుకోకపోతే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అదేవిధంగా.. బ్లడ్ టెస్టులు చేయించండి. ఎందుకంటే.. ఇతర ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న కూడా తెలిసిపోతుంది. దాంతో తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.