Farmers Protest Delhi :దిల్లీ వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతుసంఘాలు సిద్ధమయ్యాయి. తమ డిమాండ్లపై కేంద్రంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావటం వల్ల ఇదివరకే పిలుపునిచ్చిన 'దిల్లీ చలో' ఆందోళన కొనసాగుతుందని రైతుసంఘాల నేతలు ప్రకటించారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు.
పోలీసుల పటిష్ఠ బందోబస్తు
ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో 20వేల మందికిపైగా రైతులు రావొచ్చని నిఘావర్గాలు అంచనా వేశాయి. దీంతో ఎక్కడికక్కడే రైతులను అడ్డుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పంజాబ్, హరిణాయాణా సరిహద్దు జిల్లాలైన అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సాలోని అనేక ప్రదేశాల్లో కాంక్రీట్ బ్లాక్‌లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల బాష్ప వాయువు గోళాలతో పోలీసులు డ్రిల్స్ నిర్వహించారు. హరియాణాలో మంగళవారం రాత్రి వరకు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలపై ఆంక్షలు విధించారు. హస్తిన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నెలరోజులపాటు సెక్షన్-144 విధించారు. రైతుల నిరసనను సంఘ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందని దిల్లీ పోలీసులు తెలిపారు.
'ప్రభుత్వం సీరియస్‌గా లేదు'
మరోవైపు 'దిల్లీ చలో' పిలుపును విరమించుకోవాలని సూచించిన కేంద్రం రైతుసంఘాల నేతలతో చండీగఢ్ వేదికగా సోమవారం అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్రమంత్రులు, పీయూష్ గోయల్, అర్జున్ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం రైతు సంఘాల ప్రతినిధులు సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జీత్‌సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్ పంధేర్‌తో చర్చలు జరిపింది.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై 5గంటలకుపైగా విస్తృతంగా చర్చలు జరిగాయి. కాగా, 2020 ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. అప్పుడు మరణించిన రైతులకు సంబంధించి ఇంకా ఎవరికైనా పరిహారం అందకుంటే ఆయా కుటుంబాలకు సాయం అందించేందుకు సమ్మతించింది. కానీ, రైతు సంఘాల కీలక డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో దిల్లీ చలో ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని కేంద్రమంత్రులతో చర్చల తర్వాత రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు కనిపించటంలేదని ఆరోపించారు.
చర్చల ద్వారానే పరిష్కారం : మంత్రి
ఉదయం 10 గంటలకు దిల్లీ వైపునకు కవాతు మొదలవుతుందని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రతి సమస్యను చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు. అందుకే రైతులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. రైతుల డిమాండ్లలో చాలావరకు ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. కమిటీ ఏర్పాటు ద్వారా మరికొన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు అర్జున్ ముండా చెప్పారు. రైతు సంఘాలు చర్చలు కొనసాగిస్తాయని ఆశిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.