Farmers Protest Chalo Delhi Update : పంటలపై కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఫిబ్రవరి 29వ తేదీ వరకు హరియాణా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల వద్దే నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ విషయాన్ని కర్షకుల ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) శుక్రవారం రాత్రి ప్రకటించాయి.
"దిల్లీ చలోపై ఈ నెల 29వ తేదీన నిర్ణయం తీసుకుంటాం. ఆ లోపు 24వ తేదీన కొవ్వొత్తుల ర్యాలీ, 26వ తేదీన కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తాం" అని కేఎంఎం నేత శర్వాణ్ సింగ్ పంధేర్ తెలిపారు. దేశ రాజధాని దిల్లీ వైపు ప్రయత్నించిన రైతులను గత 11 రోజులుగా భద్రతా బలగాలు హరియాణా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల వద్ద నిలువరించాయి.
శుభకరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే
యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ బుధవారం జరిగిన ఘర్షణల్లో మరణించడం వల్ల ఆందోళనను రెండు రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్‌కరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. ఖనౌరీ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై హరియాణా పోలీసులు అడ్డగించారు. వారిపై పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు.