Family Drowned In Narmada River : గుజరాత్‌లోని నర్మదా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరందరూ స్నానానికి వెళ్లగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. నీట మునిగిన వారి కోసం నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఎన్ డీఆర్ ఎఫ్), వడోదర అగ్నిమాపక బృందం వెతుకుతోంది. రోజు గడిచినా ఇంకా వారి ఆచూకీ దొరకడం లేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
నర్మదా నదిలో స్నానానికి దిగిన ఏడుగురు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. బాధితులు సూరత్ నుంచి నర్మదా జిల్లాలోని పోయిచా వద్దకు వచ్చిన బృందంలో భాగమని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఏడుగురు ఈత కొట్టేందుకు నర్మదా నదిలో దిగారని, అయితే వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారని తెలిపారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని చెప్పారు.
కాగా, నర్మదా నదిలోని పోయిచా ప్రాంతాన్ని వేసవిలో పిక్నిక్ స్పాట్‌గా నిలిచింది. ఇక్కడ ఈత కొట్టడానికి ఎక్కువ మంది పర్యటకులు వస్తారు. నర్మదా జిల్లా యంత్రాంగం ఇటీవల నదిలో లైసెన్స్ లేకుండా పడవలు నడపకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆదేశాలకు పట్టించుకోకుండా పడవలను నడుపుతున్నారు.