Fake Court in Gujarat :గుజరాత్లో నకిలీ కోర్టు గుట్టురట్టు అయ్యింది. నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, జడ్జిగా తీర్పులు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే?
అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్ట్ రిజిస్ట్రార్- కరంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ ప్రభుత్వ భూమికి సంబంధించి 2019లో నమోదైన కేసులో తన క్లయింట్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ తర్వాత ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో తన క్లయింట్ పేరును చేర్చాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ ఉత్తర్వును అమలు చేయాలని కోరుతూ శామ్యూల్, మరొక న్యాయవాది ద్వారా సిటీ సివిల్ కోర్టులో అప్పీల్ చేశాడు. అలాగే తాను జారీ చేసిన నకిలీ ఆర్డర్‌ను కూడా పిటిషన్‌కు జత చేశాడు. దీంతో అసలు విషయం బయటపడగా, సిటీ సివిల్ కోర్ట్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నకిలీ కోర్టు ఏర్పాటు చేసిన శామ్యూల్ (ETV Bharat) మధ్యవర్తిగా నటిస్తూ!
నిందితుడు శామ్యూల్ మధ్యవర్తిగా నటిస్తూ వివాదాస్పద భూములపై ఆదేశాలు జారీ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్. దీంతో పోలీసులు శామ్యూల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గాంధీనగర్‌లోని తన కార్యాలయంలో నిజమైన కోర్టు వాతావరణాన్ని శామ్యూల్ సృష్టించాడని పోలీసులు తెలిపారు.
గుజరాత్లో ఏర్పాటు చేసిన నకిలీ కోర్టు (ETV Bharat) "కనీసం ఐదేళ్లుగా అహ్మదాబాద్‌లో శామ్యూల్ నకిలీ కోర్టు నడుస్తోంది. సిటీ సివిల్ కోర్టులో భూ వివాదాల కేసులు పెండింగ్‌లో ఉన్న వ్యక్తులను నిందితుడు ట్రాప్ చేశాడు. వారి నుంచి కేసుకు కొంత మేర నగదును తీసుకున్నాడు. శామ్యూల్ మొదట తనను తాను కోర్టు నియమించిన అధికారిక మధ్యవర్తిగా పరిచయం చేసుకుంటాడు. తర్వాత పిటిషనర్లకు గాంధీనగర్‌లో ఉన్న తన కార్యాలయానికి పిలిపించుకుంటాడు. తన ఆఫీసును కోర్టులాగా తీర్చిదిద్దాడు. అక్కడ ట్రైబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా నటిస్తూ తన క్లైయింట్లను అనుకూలమైన తీర్పును ఇచ్చి, ఉత్తర్వును జారీ చేస్తాడు. శామ్యూల్ అనుచరులే న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులుగా నటిస్తారు." అని పోలీసులు తెలిపారు.