తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిజ్జర్​ హత్య కేసుతో నాకేం సంబంధం లేదు- ట్రూడో వల్ల మొత్తం నాశనం!'

నిజ్జర్​ హత్యోదంతంలో తన పాత్ర లేదన్న భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

India Canada Diplomatic Row
India Canada Diplomatic Row (ANI, Associated Press)

India Canada Diplomatic Row :ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యోదంతంలో తన పాత్ర లేదని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ స్పష్టం చేశారు. ఈ కేసులో తన పాత్ర ఉందని కెనడా సర్కార్ ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని చెప్పారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, నిజ్జర్ హత్యతో తనకు అసలు సంబంధం లేదని ఓ ప్రముఖ మీడియాతో ముఖాముఖిలో తెలిపారు.

కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ట్రూడో సర్కార్ చేసిన ఆరోపణలను సంజయ్ కుమార్ వర్మ తోసిపుచ్చారు. సిక్కు వేర్పాటువాదుల సమాచారాన్ని రాయబారులు ఇండియాకు అందిస్తే పలు క్రిమినల్‌ గ్యాంగ్‌ల ద్వారా భారత్‌ వారిని చంపేస్తోందని కెనడా ఆరోపించింది. వాటిని కూడా సంజయ్ వర్మ ఖండించారు. కెనడాలో భారత హై కమిషనర్‌గా తాను ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదన్నారు.

భారత్ ఏ తరహా చర్య తీసుకున్నా అది బహిరంగంగానే జరిగిందని స్పష్టం చేశారు. భారత్-కెనడా సంబంధాలను ట్రూడో నాశనం చేశారని మండిపడ్డారు. ఒట్టావా చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం అనుమానితులుగా పేర్కొనడంపై ఇటీవల భారత్ తీవ్రంగా స్పందించింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది. దీనికి ప్రతిగా కెనడా ప్రభుత్వం భారత హై కమిషనర్ సంజయ్ వర్మ సహా ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది.

మరోవైపు, ఇటీవల భారత క్రిమినల్‌ గ్యాంగ్‌ల నుంచి కెనడా వాసులకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ముప్పులేదని రాయల్‌ కెనేడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ అధికారిణి బ్రిగెట్టే గౌవిన్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ దేశానికి చెందిన సీబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హింసలో భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ ఆర్సీఎంపీ కొన్నాళ్ల క్రితమే ఆరోపించారు. ఈ నేపథ్యంలో బ్రిగెట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొన్ని సార్లు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దీనిలో భాగంగానే గతంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details