తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అధికారులు జడ్జిలు కాలేరు- ఇళ్లను కూల్చివేసే రైట్స్ లేవ్​: సుప్రీంకోర్టు

ఏకపక్షంగా బుల్డోజర్‌ కూల్చివేతలు తగవని బుల్డోజర్​ న్యాయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

SC on Demolition
SC on Demolition (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 11:22 AM IST

Updated : Nov 13, 2024, 12:34 PM IST

SC on Demolition :కార్యనిర్వహక అధికారి జడ్జి కాలేరని, ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించి, వాళ్ల ఇళ్లను కూల్చివేయాలని నిర్ణయించే అధికారం కూడా వారికి లేరని సుప్రీం కోర్టు పేర్కొంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల ఇళ్లను కూల్చివేయడం తగదని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని జస్టిస్ట్ బిఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్​నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

'కేవలం నిందితులు లేదా దోషులుగా ఉన్నందున ప్రజల ఇళ్లను కూల్చివేస్తే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. మహిళలు, పిల్లలను రాత్రిపూట వీధుల్లో చూడడం సంతోషకరమైన దృశ్యం కాదు. ముందస్తు షోకాజ్ నోటీసు లేకుండా, నోటీసు అందజేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా కూల్చివేతలు చేపట్టరాదు. అంతేకాకుండా కూల్చివేత ప్రక్రియను వీడియో తీయాలి. ప్రభుత్వ భూమిలో అనధికారికంగా నిర్మాణాలు జరిగినా లేదా న్యాయస్థానం కూల్చివేతకు ఆదేశించినా తమ ఆదేశాలు వర్తించవు. రాజ్యాంగం, క్రిమినల్ చట్టం ప్రకారం నిందితులు, దోషులకు కొన్ని హక్కులు రక్షణలు ఉన్నాయి' అని ధర్మాసనం తెలిపింది.

2019లో రోడ్డు విస్తరణలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన మనోజ్‌ తిబ్రేవాల్‌ ఆకాశ్‌ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఎలాంటి నోటీసులను ఇవ్వకుండా కూల్చడం వల్ల తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈనెల 6న తీర్పు ఇవ్వగా, రెండు రోజుల తర్వాత అందుకు సంబంధించిన పూర్తిస్థాయి కాపీని అధికారులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. నిందితుల ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడం సరికాదని స్పష్టం చేస్తూ, అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది. అయితే, రహదారులు, ఫుట్‌పాత్‌ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ మినహాయింపునిచ్చింది.

Last Updated : Nov 13, 2024, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details