EVMs Row Musk :పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయంటూ టెస్లా, స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు తీవ్రదుమారం రేపుతున్నాయి. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎలాన్ మస్క్ EVMలపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో EVMలను తొలగిస్తే హ్యాకింగ్‌ను నివారించొచ్చని ఆయన సూచించారు.
పేపర్ ట్రయిల్ ఉండడం వల్లే సమస్యను!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలన్న మస్క్, వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎప్.కెన్నెడీ జూనియర్ కూడా ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో EVMల అవకతవకలు జరిగాయని తెలిపారు. పేపర్ ట్రయిల్ ఉండడం వల్లే సమస్యను గుర్తించగలిగామని, లేదంటే ఏం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలని, అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
EVMలు బ్లాక్‌బాక్సులుగా మారాయ్!
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో మన దేశంలోని విపక్షాలు గొంతు కలుపుతున్నాయి. భారత్‌లో EVMలు బ్లాక్‌బాక్సులుగా మారాయని, వాటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. EVMలపై వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు రాహుల్. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎలాన్ మస్క్ పోస్టును సైతం రాహుల్ ట్యాగ్ చేశారు.
'తేలిగ్గా ఆరోపణలు చేస్తున్న మస్క్'
మరోవైపు, EVMలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. EVMల హ్యాకింగ్ పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఎలాన్ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కనెక్టివిటీ, బ్లూటూత్ వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ చేయడం అసంభవమని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ కంట్రోలర్లను ఎవరూ రీప్రోగ్రామ్ చేయలేరని స్పష్టం చేశారు. EVMలను తయారు చేయడం సహా సరిగ్గా ఉపయోగించడం ఎలాగో భారత్ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.
'కావాలంటే ట్రైనింగ్ ఇస్తాం'
ఎలాన్ మస్క్‌కు అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మూడు ఐఐటీలకు చెందిన నిష్ణాతులైన ప్రొఫెసర్ల బృందం EVMలను ఆధునికీకరించిందని గుర్తుచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించిన సాంకేతిక నిపుణుల బృందం EVMలు సురక్షితమని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న EVMలతో పోలిస్తే భారత్ లో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రత్యేకమైనవని ఐఐటీ బాంబేకు చెందిన ప్రొఫెసర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. భారత EVMలకు ఇతర పరికరాలతో ఎలాంటి అనుసంధానం ఉండదని పేర్కొన్నారు. కరెంటు సరఫరా కూడా EVMలకు ఉండదని, బ్యాటరీతోనే పనిచేస్తాయని గుర్తుచేశారు.