El Nino Effect In India :ఎల్ నినో పరిస్థితులు వేసవి కాలం మొత్తం ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది భానుడి భగభగలు తప్పవని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. ఈశాన్య భారతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
'మార్చి-మే మధ్యలో అధిక ఉష్ణోగ్రతలు'
మార్చి నుంచి మే మధ్యలో దేశంలోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. మార్చిలో ఉత్తర, మధ్య భారతంలో మాత్రం వడగాలుల తీవ్రత ఉండకపోవచ్చని చెప్పారు. ఎల్ నినో పరిస్థితులు కొనసాగుతుండటం వల్ల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాలు వేడెక్కడం వేసవి కాలం మొత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరే అవకాశం ఉందని తెలిపారు.
La Nina Effect In India :మరోవైపు దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లా నినా పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా. దేశంలో మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇదిలాఉంటే, ఏప్రిల్ లేదా మేలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం వల్ల ఐండీ వాతావరణ హెచ్చరికలతో అటు రాజకీయ నాయకులు, ఇటు ఓటర్లు ఇప్పటి నుంచే ఎండలకు జంకుతున్నారు.