Scientist R.Chidambaram Dies : భారతదేశానికి చెందిన ప్రముఖ అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) శనివారం ఉదయం కన్నుమూశారు. ముంబయిలోని జస్‌లోక్ ఆస్పత్రిలో శనివారం వేకువజామున 3 గంటల 20 నిమిషాలకు రాజగోపాల చిదంబరం తుదిశ్వాస విడిచారని అణు ఇంధన శాఖ వెల్లడించింది.
అణ్యాయుధాల రూపకల్పనలో కీలక పాత్ర
రాజగోపాల చిదంబరం చెన్నైలో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్డీ సాధించారు. 1974లో జరిపిన పోఖ్రాన్-1, 1998లో నిర్వహించిన పోఖ్రాన్- 2 అణు పరీక్షల్లో కీలకంగా పనిచేశారు. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) డైరెక్టర్‌గానూ పనిచేశారు. అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గానూ రాజగోపాల చిదంబరం సేవలు అందించారు. అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. అణ్వాయుధాల రూపకల్పనలో రాజగోపాల చిదంబరం ముఖ్యపాత్ర పోషించారు. ఈ క్రమంలో దేశానికి ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది.
R Chidambaram Awards
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి విశిష్ఠ పూర్వ విద్యార్థి అవార్డు (1991)ను అందుకున్నారు.
- జవహర్లాల్ నెహ్రూ వందో జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇచ్చిన ఇంటర్నేషనల్ విజిటింగ్ ఫెలోషిప్ (1992) అవార్డును తీసుకున్నారు.
- భౌతిక శాస్త్రవేత్త సీవీ రామన్ వందో జయంతి సందర్భంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఇచ్చిన రామన్ బర్త్ సెంటెనరీ అవార్డు (1995)ను అందుకున్నారు.
- లోకమాన్య తిలక్ అవార్డు (1998), వీర్ సావర్కర్ అవార్డు (1999), దాదాభాయ్ నౌరోజీ మిలీనియం అవార్డు (1999)ను సాధించారు.
- ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మేఘనాథ్ సాహా మెడల్ (2002)ను రాజగోపాల చిదంబరంకు ఇచ్చింది. అలాగే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు (2003)లో చిదంబరంకు దక్కింది.
- హోమీ బాబా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు (2006), ఇంజినీరింగ్ లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ అవార్డు (2009), సీవీ రామన్ మెడల్ (2013), కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు (2014) దక్కింది.