CM Order To Study Polavaram Project Impact on Telangana : ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్ టీంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు.
2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. ఈ మేరకు పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కూడా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని తెలిపారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎంకు రేవంత్‌రెడ్డికి అధికారులు చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలపాలి : బనకచర్లపై ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆగస్టు 2024లో పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
"ఎందుకు? ఏమిటి? ఎలా?"- పోలవరంపై అంతర్జాతీయ నిపుణుల అధ్యయనం - Internation Team For Polavaram