ED Audio Clip Delete Athishi :గత ఏడాది కాలం నుంచి దర్యాప్తులో భాగంగా రికార్డు చేసిన సాక్షుల ఆడియో క్లిప్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) డిలీట్ చేసిందని దిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇది కుంభకోణం కేసులో దర్యాప్తు కాదని, ఈడీ చేస్తున్న దర్యాప్తే ఒక స్కామ్ అని ఘాటుగా విమర్శించారు. ఆడియో ఫైళ్లను డిలీట్ చేసి ఎవరిని కాపాడాలనుకుంటున్నారు అని ఈడీని ప్రశ్నించారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సాక్షులు, నిందితులను బెదిరించి బలవంతంగా వాంగ్మూలాలు సేకరించినట్లు ఆతిశీ ఆరోపించారు. రెండేళ్ల నుంచి ఆప్ నేతలను బెదిరిస్తోందన్నారు. మద్యం కుంభకోణం పేరుతో తమ పార్టీ నేత ఒకరి ఇంటిపై దాడులు, మరొకరికి సమన్లు పంపటం, ఇంకొకరిని అరెస్ట్ చేయటం జరుగుతోందన్నారు. రెండేళ్లలో వందసార్లకుపైగా ఈడీ సోదాలు చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయిందని చెప్పారు. ఆధారాలు సమర్పించాలని కోర్టు పదేపదే సూచిస్తున్నా ఈడీ కనీసం ఆధారాలు కూడా సేకరించలేకపోయిందన్నారు.
ఆప్ నేతలతోపాటు తమ పార్టీతో సంబంధమున్న వారిపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయని అతిషి ఆరోపించారు. ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా, దిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌కుమార్ సహా, పార్టీకి చెందిన పలువురి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్ధల సాయంతో ఆప్‌ను అణిచివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, అలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పదలచుకున్నట్లు దిల్లీ మంత్రి అతిషి చెప్పారు.