Varanasi Annakoot Mahaparva : ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో కాశీవిశ్వనాథుడు, అన్నపూర్ణ ఆలయాల్లో అన్నకూట్ మహాత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయాల్లో ఎన్నడూ చూడనన్ని స్వీట్లు, లడ్డూలు, రుచికరమైన వంటకాలు సహా 56 రకాల నైవేద్యాలను శివుడు, అన్నపూర్ణాదేవీకి సమర్పించారు. అన్నపూర్ణ ఆలయంలో 511 క్వింటాళ్లు, విశ్వేశ్వరుని గుడిలో 14 క్వింటాళ్ల నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం భక్తులకు ఈ ప్రసాదాన్ని పంచారు.
లడ్డూలతో అందంగా ఆలయం అలంకరణ
అన్నపూర్ణ ఆలయంలో ఒక్కో గోడను 21 క్వింటాళ్ల లడ్డూలతో అలకరించారు. మాతా ఆలయ అలంకరణలో 8 క్వింటాళ్ల లడ్డును ఉపయోగించారు. అలాగే కాశీ విశ్వనాథుడి గుడిలో 8 క్వింటాళ్ల లడ్డూలను ఉపయోగించి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తాన్ని రంగుల పూలమాలలతో అలంకరించారు.
అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
అన్నకూట్ మహోత్సవం సందర్భంగా కాశీ అన్నపూర్ణమ్మ దర్శనానికి భక్తులను అక్టోబరు 29 నుంచే అనుమతించారు. ఈ క్రమంలో భక్తులు భారీగా గుడికి చేరుకుని చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, అన్నకూట్ మహోత్సవం నవంబరు 2న జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగు రంగుల పూలమాలలతో అలంకరించారు. అన్నకూట్ లో భాగంగా మాతా దర్బార్ కు 511 క్వింటాళ్ల భోగాన్ని సమర్పించారు.
దసరా నుంచే ప్రసాదాలు తయారీ
దసరా నవరాత్రులు ప్రారంభం నుంచి అన్నపూర్ణ దర్బార్‌లో ప్రసాదం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 85 మంది కలిసి ఈ ప్రసాదాన్ని సిద్ధం చేశారు. మూడు తరాలుగా ఇక్కడే ప్రసాదం తయారుచేస్తున్నట్లు ఒక వ్యక్తి తెలిపారు. 40 రకాల స్వీట్లు, 17 రకాల నైవేద్యాలు తయారుచేసినట్లు చెప్పారు.
ఏటా అన్నకూట్ మహోత్సవాలు
కాశీ విశ్వనాథ్ ధామ్‌లో ప్రతి ఏటా కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ఏటా దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్ పూజ నాడు ఈ ఉత్సవాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తారు. అన్నకూట్ అంటే సమృద్ధిగా ఉండే ఆహార ధాన్యాలు. ఈ పండుగ ప్రజల శ్రేయస్సు, భక్తికి ప్రతీక అని భావిస్తారు.
వందల ఏళ్లుగా సంప్రదాయం
దీపావళి మరుసటి రోజే శివుడు కాశీకి వచ్చాడని భక్తుల నమ్మకం. శివుడికే అన్నపూర్ణాదేవీ భిక్ష వేశారని విశ్వసిస్తారు. అలాగే కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం. దీపావళి తర్వాత రోజున వారణాసిలో అన్నకూట్ పండగ నిర్వహించడం చాలా ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది.