Harbhajan Singh Comments On Imane Khelif : పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌పై, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'ఆమె' నుంచి స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాడు. మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఖెలిఫ్ పురుషుడేనని తేలిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇమానె ఖెలిఫ్ పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే, 'ఆమె' కాదంటూ ఆ సమయంలో ప్రత్యర్థులు వాదించారు. అయినప్పటికీ ఫైనల్ కు చేరుకుని స్వర్ణాన్ని కొల్లగొట్టింది. ఇప్పటికీ ఇమానె జెండర్ పై అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఖెలిఫ్ లింగ గుర్తింపునకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ లీక్ అయ్యింది. అందులో కీలక విషయాలు బయటపడడం వల్ల క్రీడావర్గాలు షాక్ కు గురయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు
కాగా, ఇమానెకు సంబంధించి వైద్య నివేదిక లీక్ కావడం వల్ల ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇమానెపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఇమానెకు వచ్చిన గోల్ మెడల్ ను వెనక్కి తీసుకోవాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
"మహిళల పోటీల్లో పురుషుడు బంగారు పతకం సాధించడం గుర్తుంది కదా? మెడికల్ రిపోర్టుల ప్రకారం అతడిలో XY క్రోమోజోమ్స్ ఉన్నాయి. పురుషుడిలోని టెస్టోస్టిరాన్లు ఖెలిఫ్ లోనూ ఉన్నాయి. కానీ, ఒలింపిక్ కమిటీ మాత్రం ఇలాంటి వాటిని పట్టించుకోదు"
"'ఆమె' కాదు అతడే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నాడని గతంలోనే చెప్పాం. ఒలింపిక్స్ పై గౌరవం కొనసాగాలంటే ఇప్పటికైనా మెడల్ ను వెనక్కి తీసుకోవాలి"
"చైనాకు చెందిన యంగ్ లూయిపై 5-0తో ఖెలిఫ్ గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. మహిళగా పోటీలో నిలిచిన యంగ్ చివరివరకూ పోరాడింది. కానీ, తొలి పోరు నుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నా, వైదొలగకుండా ఖెలిఫ్ కొనసాగడం విచిత్రం అనిపించింది. కేవలం 46 సెకన్లలోనే ఓ బౌట్‌లో గెలిచినప్పుడే ఆమె కాదనే అందరికీ తెలుసు"
"ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు అది. మహిళలు తమ హక్కుల కోసం ఇంకా పోరాడాల్సిన పరిస్థితి కొనసాగడం బాధాకరం" అని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
రిపోర్టులో తెలింది అదే!
ఫ్రెంచ్ జర్నలిస్ట్ జాప్ఫర్ ఎయిట్ ఔడియా ప్రకారం ఇమానెకు ఖెలిఫ్ శరీరంలో అంతర్గంతగా వృషణాలు, XY క్రోమోజోములు ఉన్నట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. ఇది 5 ఆల్ఫా రిడక్టేజ్ ఇన్ సఫిసియెన్సీ అనే రుగ్మతను సూచిస్తుంది. పారిస్ లోని క్రెమ్లిన్ బికెట్రే ఆసుపత్రి, అల్జీరియాకు చెందిన మొహమ్మద్ లామినే ఆసుపత్రికి సంబంధించిన వైద్య నిపుణులు ఇమానెకు సంబంధించి 2023 జూన్‌లో ఓ నివేదిక ను విడుదల చేశారు. అందులో ఇమానెలో అంతర్గతంగా వృషణాలు ఉన్నాయని, గర్భసంచి లేదని ఈ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇక ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఇతర జననాంగాలు సైతం ఉన్నట్లు అందులో తేలింది. దీంతో ఇమానె మహిళ కాదని, పురుషుడని నిర్ధరణ అయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.