How to Check the Purity of Spices: మసాలా.. భారతీయల వంటింట్లో దీనికి ముఖ్యమైన స్థానం ఉంటుంది. అయితే ఒకప్పుడు ఇంట్లోకి అవసరమైనవన్నీ మహిళలే స్వయంగా ప్రిపేర్ చేసుకునేవారు. నేటి బిజీ లైఫ్లో ఇంట్లో చేసుకునే ఓపిక లేకో.. సరిగా కుదరడం లేదనో బయట కొనుక్కోవడం మామూలైంది. అయితే బయట కొనే వాటిల్లో చెక్క పొట్టు, యాసిడ్స్, జంతునూనెలు.. ఏమేం ఉంటున్నాయో ఊహించుకుంటేనే గుండెల్లో భయం పుడుతుంది. అందుకే పరీక్షించుకుని.. సరైనదని అనిపిస్తేనే వాడాలి. అందుకోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) కొన్ని సూచనలు చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పసుపు: కూరకు చక్కని రంగు, రుచిని అందించడంలో దీని పాత్ర ప్రత్యేకం. అయితే కేవలం కూరలకే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే ఇందులో రసాయనాలు కలిసేందుకు ఆస్కారమెక్కువ. కాబట్టి పసుపు కల్తీని ఇలా గుర్తించండి. అందుకోసం.. గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకుని, పావు స్పూను పసుపు కలపండి. నీళ్లు పసుపు రంగులోకి మారితే దానిలో హానికారక రసాయనాలు ఉన్నట్టే. పసుపు.. నీటి రంగును పెద్దగా మార్చదు మరి!
మసాలా పొడులు: ధనియాలు, జీలకర్ర, సాంబారు అని ఎన్నెన్నో మసాలా పొడులు తెచ్చుకుంటాం! మరి అవి కల్తీయో కాదో తెలుసుకోవాలని కదా. అందుకోసం.. ఏదైనా పాత్రలో నీటిని తీసుకుని, దానిలో ఈ పొడులను వేయండి. నీటిపై తేలితే చెక్క పొట్టు కలిసినట్టే. లేదా అయోడిన్ ద్రావణం ఒక చుక్క వేసి చూడండి. నీలం రంగులోకి మారితే పిండి కలిపారని అర్థం.
లవంగం: వీటి నుంచి తీసిన నూనెకు గిరాకీ ఎక్కువ. వీటిని కల్తీని గుర్తించాలంటే.. వీటినీ నీటిలో వేయండి. మంచివైతే వీటిలోని నూనెల కారణంగా మునిగిపోతాయి. నీటిపై తేలితే మాత్రం నూనెలు తీసి వాటిని అమ్ముతున్నారన్నట్టే!
కుంకుమపువ్వు: స్వీట్లకు రంగులద్దడం కోసమనీ.. అందానికి మంచిదనీ ధర ఎక్కువైనా వాడుతుంటాం. ఇంతా ఖర్చు పెట్టి కొన్నది నకిలీదైతే?.కాబట్టి.. ఒక రేకను తీసుకుని వేళ్ల మధ్య నలపండి. అసలైన కుంకుమపువ్వు రేక గట్టిగా ఉంటుంది. వేళ్లకు రంగునిచ్చినా చాలా కొద్ది పరిమాణంలోనే. అలాకాకుండా ఈజీగా విరిగినా, వేళ్లకు ఎక్కువ రంగు అంటినా నకిలీదని అర్థం.
దాల్చినచెక్క: ఇదీ ఔషధాల గనే. సాధారణంగా ఇది పలుచగా ఉంటుంది. అలా లేకుండా మందంగా మల్టిపుల్ లేయర్లతో ఉంటే నకిలీదని గుర్తించాలి.
ఇంగువ: కూరల్లో రుచిని పెంచడంలో కూడా ఇంగువ పాత్ర చాలానే ఉంటుంది. ఈ క్రమంలోనే కల్తీ ఇంగువను గుర్తించేందుకు.. ఒక స్పూన్లోకి కొద్దిగా ఇంగువను తీసుకోవాలి. ఆ స్పూన్ను బర్నర్ మీద పెట్టి కాలిస్తే కర్పూరం వెలిగినట్లు వెలిగితే స్వచ్ఛమైనది. అలా కాకుండా మామూలుగా ఉంటే నకిలీది.
మిరియాలు: మిరియాల పొడిని కూడా ఎన్నో వంటల్లో ఉపయోగిస్తాము. మరి ఆ మిరియాలు మంచివో కావో తెలియాలంటే.. ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ మిరియాలు వెయ్యాలి. మిరియాలు అడుగుకి చేరితే స్వచ్ఛమైనవని.. నీటిపైన తేలితే అందులో బొప్పాయ గింజలు కలిసినట్లు గుర్తించాలంటున్నారు.
మార్కెట్లో "కల్తీ టీ పొడి" హల్చల్ - మీరు వాడేది స్వచ్ఛమైనదేనా? ఇలా గుర్తించండి!
అలర్ట్ : మీరు తాగే పాలలో సబ్బు నీళ్లు, యూరియా గుళికలు! - కల్తీని ఇలా ఈజీగా కనిపెట్టండి