SC Historic Ruling On Private Property : ప్రైవేటు ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులను- ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 7:2 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. అయితే మెజారిటీ తీర్పును జస్టిస్ బివి నాగరత్న పాక్షికంగా విభేదించగా, జస్టిస్ సుధాన్షు ధులియా అన్ని అంశాలపై విభేదించారు.
రాజ్యాంగంలోని అధికరణ 39(బీ) ప్రకారం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని వనరులను పంపిణీ చేయడానికి రాష్ట్రాలు స్వాధీనం చేసుకోవచ్చని జస్టిస్ కృష్ణయ్యర్ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సామ్యవాద సిద్ధాంతం ఆధారంగా ఇంతకుముందు ఇచ్చిన తీర్పులను కూడా రాగ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది.
ఈ అంశంపై దాఖలైన 16 పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అందులో ముంబయికి చెందిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్(పీఓఏ) ఒకటి. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) చట్టంలోని చాప్టర్ VIII-Aను పీఓఏ వ్యతిరేకించింది. ఈ చాప్టర్‌ను 1986లో తెచ్చిన సవరణ ద్వారా చట్టంలో పొందుపర్చారు. పునరుద్ధరణ ప్రయోజనాల కోసం నివాసితులు అభ్యర్థిస్తే- సెస్డ్ భవనాలు, అవి నిర్మించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు రాష్టానికి ఈ చాప్టర్ అనుమతి ఇస్తుంది. రాజ్యాంగంలోని అధికరణ 39(బీ)ను అనుగుణంగా ఈ చట్టాన్ని రాష్ట్రం రూపొందించింది.