EC On Children Election Campaign : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రూపంలోనైనా చిన్నారులను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాల పంపిణీ, నినాదాలు చేయడం సహా ఎందులోనూ పిల్లలను ప్రచారంలో భాగం చేయవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేసింది.
'చిన్నారుల ప్రమేయాన్ని సహించేది లేదు'
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో చిన్నారుల ప్రమేయాన్ని సహించేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు తమ చేతులతో చిన్నారులను ఎత్తుకోవడం, వాహనంలో ర్యాలీలో పిల్లలను తీసుకెళ్లడం సహా ఏ పద్ధతిలోనైనా ప్రచార కార్యక్రమాలకు పిల్లలను ఉపయోగించకూడదని సీఈసీ తెలిపింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ, అభ్యర్థి చిహ్నాల ప్రదర్శనలకు కూడా పిల్లలను వినియోగించుకోవద్దని సూచించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో క్రియాశీల పక్షాలు అన్నీ భాగస్వాములు కావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు.