Lok Sabha Election 2024 : పోలింగ్ శాతం వివరాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విపక్షాలకు లేఖ రాసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఎన్నికల సంఘం. వివరణ కోరే ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహించింది. ఈ లేఖ ఓటర్లు, రాజకీయ పార్టీల మనసుల్లో అనేక సందేహాలను సృష్టిస్తుందని అభ్యంతరం తెలిపింది. ఓటింగ్ శాతం ప్రకటన ఆలస్యం, నిర్వహణ లోపంపై ఖర్గే చేసిన ఆరోపణలు ఈసీ ఖండించింది. ఓటింగ్ డేటా విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల రోజు చెప్పిన ఓటింగ్ శాతం కంటే తర్వాత ప్రకటించిన డేటా అధికంగానే ఉందని తెలిపింది.
"ఓటింగ్ శాతంపై ఖర్గే చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. లోక్సభ ఎన్నికల మధ్యలో గందరగోళం సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగకుండా అవరోధాలు కల్పించేలా కనిపిస్తున్నాయి. ఇది ఓటర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఓటింగ్లో పాల్గొనకుండా ఓటర్లను బలహీన పరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల యంత్రాంగాన్ని నిరుత్సాహ పరుస్తుంది" అని ఈసీ పేర్కొంది.
విపక్షాలకు ఖర్గే లేఖ
అంతకుముందు మే 7న సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆ వైరుద్ధ్యాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని అందులో పిలుపునిచ్చారు. ఈసీ పూర్తి స్వతంత్రత, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటం అత్యావశ్యకమని తెలిపారు.