Earthquake In Himachal Pradesh :హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా పట్టణంలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.3గా తీవ్రత నమోదైంది. చంబా పట్టణంతో పాటు అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలీలోనూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. రాత్రి 9 గంటల 34 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు రాజధాని శిమ్లాలోని జాతీయ భూకంప అధ్యయన విభాగం- ఎన్సీఎస్ తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్ భూకంపం ప్రభావంతో పంజాబ్, హరియాణాల్లోని పలు ప్రాంతాలతో పాటు ఛండీగఢ్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. పలుచోట్ల జనం భయంతో బయటకు పరుగులు తీశారు.
Himachal Pradesh Earthquake : పాంగిలోని 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. భూకంపం కారణంగా పాంగి సమీపంలోని గ్రామాల్లో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రభావితమైందని, ఆ ప్రాంతానికి బృందాలను పంపించామని అధికారులు తెలిపారు. సమాచార వ్యవస్థ దెబ్బతిన్నందున, ప్రాణ, ఆస్తి నష్టంపై నివేదికలు అందాల్సి ఉందని చెప్పారు.
119 ఏళ్లనాటి భూకంపంలో 20వేల మంది మృతి!
రాష్ట్రంలో తరచుగా భూకంపాలు సంభవించే ఐదు ప్రాంతాల్లో శిమ్లా నుంచి 370 కి.మీ దూరంలో ఉన్న చంబా జిల్లాను ఒకటిగా చెబుతారు. 1905లో ఇదే ఏప్రిల్ 5వ తేదీన కంగ్రా జిల్లాలోనూ భారీ భూకంపం సంభవించిందని ఎన్సీఎస్ గణాంకాలు చెబుతున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత ఏకంగా 7.8 తీవ్రతతో నమోదైంది. ఈ విపత్తు ధాటికి 20వేల మందికిపైగా మరణించారు. కంగ్రా, ధర్మశాల, మెక్లీడ్‌గంజ్ సహా తదితర ప్రాంతాల్లో లక్షకుపైగా భవనాలు దెబ్బతిన్నాయి. 53వేలకుపైగా పశువులు మృత్యువాత పడ్డాయి.