తెలంగాణ

telangana

ETV Bharat / bharat

RSSను 'ఆత్మీయంగా' చూసిన అంబేడ్కర్​ - గాంధీజీ కూడా! - AMBEDKAR VISITED RSS WING

1940లో ఆర్​ఎస్​ఎస్​ శాఖను అంబేడ్కర్​ దర్శించారు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్​

Ambedkar Visited RSS Wing
Ambedkar Visited RSS Wing (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 7:14 AM IST

Ambedkar Visited RSS Wing : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 85 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని స్థానిక రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్​ఎస్​ఎస్) శాఖను సందర్శించినట్లు, దాని మీడియా వింగ్ పేర్కొంది. 'కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, తాను రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​ను ఆత్మీయతా భావంతోనే చూసినట్లు' ఆ సందర్భంగా అంబేడ్కర్‌ చెప్పినట్లు, ఆర్​ఎస్​ఎస్​కు చెందిన విదర్భ ప్రాంత మీడియా వింగ్‌ 'విశ్వ సంవాద్‌ కేంద్ర' (వీఎస్‌కే) వెల్లడించింది.

ఎన్ని సవాళ్లు ఎదురైనా?
తన ప్రయాణంలో ఆర్​ఎస్​ఎస్​ ఎన్నో సవాళ్లు, ఆరోపణలను ఎదుర్కొంది. అయినప్పటికీ అవన్నీ అవాస్తవాలే అని నిరూపించి ఓ సామాజిక సంస్థగా నిలదొక్కుకొన్నట్లు వీఎస్​కే తెలిపింది. వివిధ కారణాలతో మూడుసార్లు నిషేధానికి గురైనా, ఎటువంటి మచ్చ లేకుండా బయటపడినట్లు వెల్లడించింది.

దళితులకు వ్యతిరేకం కాదు
"ఆర్​ఎస్​ఎస్​ దళిత వ్యతిరేకి అని, అంబేడ్కర్‌కు దూరమని తప్పుడు ప్రచారం చేశారు. ఇపుడు బయటకు వచ్చిన ఈ కొత్త డాక్యుమెంట్​ అంబేడ్కర్, ఆర్​ఎస్​ఎస్​ మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని తెలుపుతోంది. 1940 జనవరి 2న సతారా జిల్లాలోని కరాడ్‌లో గల సంఘ్‌ 'శాఖ'ను సందర్శించిన అంబేడ్కర్‌ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగించారు" అని వీఎస్‌కే వివరించింది. ఈ విషయం ఆ ఏడాది జనవరి 9వ తేదీ నాటి మరాఠీ దినపత్రిక 'కేసరి'లో ప్రచురితమైనట్లు వార్త క్లిప్పింగును తన ప్రకటనకు జోడించింది.

స్వయం సేవకులతో రాజ్యాంగ నిర్మాత చర్చలు
ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంకర్త దత్తోపంత్‌ ఠెంగడీ రాసిన 'డాక్టర్‌ అంబేడ్కర్‌ ఔర్‌ సామాజిక్‌ క్రాంతీకి యాత్ర' పుస్తకాన్ని కూడా వీఎస్‌కే ప్రస్తావించింది. ఇందులోని 8వ అధ్యాయంలో అంబేడ్కర్‌ - ఆర్​ఎస్ఎస్​ అనుబంధం గురించి రాశారు. "అఖిల భారత హిందువులను ఏకం చేసే సంస్థగా సంఘ్‌ గురించి అంబేడ్కర్‌కు పూర్తిగా తెలుసు. స్వయం సేవకులు ఆయనతో తరచూ చర్చలు జరిపేవారు" అంటూ దత్తోపంత్‌ విశ్లేషించినట్లు పేర్కొంది. సంఘ్‌ అనేది కేవలం బ్రాహ్మణుల కోసమే అనే ఆరోపణ కూడా ఇపుడు పటాపంచలైనట్లు తెలిపింది.

మహాత్మాగాంధీ సైతం 1934లో వర్ధాలోని ఆర్​ఎస్​ఎస్​ శిబిరాన్ని సందర్శించి, కులరహిత సమాజంతో అంటరానితనం నిర్మూలనకు చేస్తున్న కృషిని అభినందించినట్లు ప్రకటనలో గుర్తుచేసింది. జాతీయ పతాకను తాము గౌరవించలేదన్న ప్రచారం కూడా వాస్తవం కాదని ఖండించింది. ఆర్​ఎస్​ఎస్​ వ్యవస్థాపకుడు డాక్టర్‌ హెడ్గేవార్‌ - ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో క్రియాశీల కార్యకర్తగా ఉన్నపుడు 'జంగిల్‌ సత్యాగ్రహ'లో పాల్గొనడం ద్వారా భారత స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకొన్నట్లు 'విశ్వ సంవాద్‌ కేంద్ర' పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details