DNA Test To Buffalo :ఎక్కడైనా భూమి, నీరు, దేవుడి పండుగ కోసం రెండు గ్రామాల మధ్య గొడవ జరగడం చూస్తుంటాం. అయితే కర్ణాటకలో దున్నపోతు కోసం రెండు గ్రామాలు గొడవపడ్డాయి. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అసలేం జరిగిందంటే?
దావణగెరె జిల్లాలోని కునిబెలకెరె, కులగట్టె గ్రామాలు దున్నపోతు కోసం గొడవ పడ్డాయి. కునిబెలకెరె గ్రామస్థులు 8ఏళ్ల క్రితం కరియమ్మ దేవత కోసం ఓ దున్నపోతును ఊరిలో విడిచిపెట్టారు. కులగట్టె గ్రామస్థులు దేవత కోసం విడిచిపెట్టిన దున్నపోతు తాజాగా కనిపించలేదు. దీంతో కునిబెలగెరెలో తమ గ్రామానికి చెందిన దున్నపోతు ఉందని వాహనంతో వచ్చి దాన్ని కులగట్టె గ్రామానికి తీసుకెళ్లిపోయారు. ఈ విషయం తెలియగానే కునిబెలకెరె గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన దున్నపోతును కులగెట్టె వాసులు తీసుకెళ్లిపోయారని ఆరోపించారు. ఈ గొడవ చివరకు పోలీస్ స్టేషన్ కు చేరింది.
పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు
తమ గ్రామానికి చెందిన దున్నపోతును కులగెట్టె గ్రామస్థులు తీసుకెళ్లిపోయారని మలేబెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కునిబెలకెరె వాసులు. ఆ దున్నపోతు తమ గ్రామానికి చెందినదని, దాన్ని ఇప్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కులగట్టె గ్రామస్థులు కూడా హొన్నాలి పోలీస్ స్టేషన్ లో కునిబెలకెరె గ్రామస్థులపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు.
దున్నపోతు వయసుపై చర్చ
మలేబెన్నూరు పోలీసులు ఇరు గ్రామాల వారిని స్టేషన్కు పిలిచి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. దున్నపోతు తమదంటే తమదని రెండు గ్రామాల ప్రజలు పోలీసుల ఎదుటే పట్టుబట్టారు. ఈ క్రమంలో దున్నపోతు వయసుపై రెండు గ్రామాల ప్రజల మధ్య చర్చ జరిగింది. తమది 8 ఏళ్ల వయసున్న దున్న అని కూనిబెళకెరె గ్రామస్థులు చెప్పారు. తమది మూడేళ్ల వయసున్న దున్న అని కులగట్టె వాసులు తెలిపారు.
దున్నపోతు డీఎన్ఏ పరీక్ష
ఈ క్రమంలో దున్న ఎవరిదని తేల్చేందుకు దాని వయసు తెలుసుకోవడం ముఖ్యమని పోలీసులు భావించారు. దున్నపోతు వయసును నిర్ధరించడానికి డీఎన్ఏ పరీక్ష చేయించారు. దంతాలు ఆధారంగా పశు వైద్యుడు దున్న వయసు ఆరేళ్లని తెలిపారు. దీంతో దున్నపోతు కునిబెలకెరె గ్రామస్థులదేనని తేలిపోయింది. ఈ నిర్ణయాన్ని కులగట్టె గ్రామస్థులు విభేదించారు. దున్నపోతు తమదేనని పట్టుబట్టారు. దీంతో విసిగిపోయిన కునిబెలకెరె గ్రామస్తులు మలేబెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ చోరీ కేసులో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దున్నపోతును అదుపులోకి తీసుకున్న పోలీసులు శివమొగ్గలోని మహావీర గోశాలలో ఉంచారు.
అప్పటికి ఊర్లో దున్నపోతు ఉండాల్సిందే!
"దేవతకు మొక్కిన దున్నపోతు కోసం కూనిబెలెకెరె, కులగట్టె గ్రామస్థుల మధ్య గొడవ మొదలైంది. దున్నపోతు అపహరణకు గురైందని మలేబెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. అప్పుడు దున్న కులగట్టె గ్రామంలో ఉన్నట్లు తెలిసింది. దున్నపోతుకు డీఎన్ఏ పరీక్ష చేసినా దున్న తమదేనని కులగట్టె గ్రామస్థులు వాదిస్తున్నారు" అని కూనిబెలెకెరె గ్రామస్థుడు వినాయక్ తెలిపాడు. మరోవైపు, దున్నకోసం మలేబెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మరొ గ్రామస్థుడు తిప్పేశ్ చెప్పాడు. కరియమ్మ దేవి పండుగకు ఇంకొక రెండేళ్లు ఉందని, అంతలోపు దున్న గ్రామానికి రావాలని అభిప్రాయపడ్డాడు.