Telangana Assembly Sessions : తెలంగాణ శాసనసభలో టూరిజం పాలసీపై రేపు స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ నెల (డిసెంబరు) 9వ తేదీన మొదలైన సమావేశాలు 16వ తేదికి వాయిదా పడ్డాయి. రేపటి నుంచి తిరిగి శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు సమావేశాలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రేపు జరగనున్న బీఏసీ(Business Advisory Committee) మీటింగ్‌లో ఎప్పటి వరకు సమావేశాలు కొనసాగుతాయో అనే విషయంపై (పనిదినాలపై) నిర్ణయం ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకు శాసన సభ ప్రారంభం కానుంది.
సంతాపం : ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి, రామచంద్రారెడ్డి, ఊకే అబ్బయ్యలకు శాసనసభ సంతాపం తెలపనుంది. అనంతరం ప్రశ్నోత్తరాల పర్వం కొనసాగుతుంది. శాసన సభ్యులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు జవాబులు ఇస్తారు. అదేవిధంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ-2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్‌మెంట్ బిల్లు-2024ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు : ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు, స్టడీటూర్లు నిర్వహిస్తామని కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. త్వరలో శాసనసభ, శాసనమండలి కమిటీలనూ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శాసనసభ, మండలి సభ్యులకు ఏర్పాటుచేసిన రెండు రోజుల పునశ్చరణ తరగతులు గురువారం(డిసెంబరు 12)న ముగిశాయి.
మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సభా కార్యకలాపాలకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేసి నూతన ఒరవడికి నాంది పలకడం శుభ పరిణామం అని తెలిపారు. శాసన సభాపతి ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ శిక్షణ తరగతుల్లో తెలుసుకున్నటువంటి తమ బాధ్యతలను రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా అమలుచేయాలని శాసనసభ, మండలి సభ్యులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు కొత్త సభ్యులు ప్రతిరోజూ హాజరై సభ ముగిసే వరకు ఉండాలని లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు - సభ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం - ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? : కేసీఆర్