Zakir Hussain Passed Away : ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడం వల్ల జాకీర్ హుస్సేన్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. జాకీర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్‌హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. ఏడేళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన వందలాది ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనేక అల్బమ్‌లు సైతం చేసిన ఆయన.. 1980వ దశకంలో పలు చిత్రాలకు పని చేశారు.
1990లో కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్యను అందుకున్నారు. హుస్సేన్ మిక్కీ హార్ట్, గియోవన్నీ హిడాల్గోతో కలిసి గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ సంగీత ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో మూడు గ్రామీలను కూడా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ లతో సత్కరించింది. 1999లో యూఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్‌తో జాకీర్ హుస్సేన్‌ను సత్కరించారు. తర్వాత..ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. జాకీర్ హుస్సేన్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. తద్వారా తొలిసారిగా వైట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడిగా జాకీర్ హుస్సేన్ గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతోపాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.