తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో 'ఎగ్జిట్ పోల్స్​' రైట్ రైట్- 2020 సీన్ రిపీట్! - DELHI POLLS EXIT POLLS PREDICTIONS

దిల్లీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలు సరైనవే- దేశ రాజధానిలో కమల వికాసం- భారీగా స్థానాలను కోల్పోయిన ఆప్

Delhi Polls Exit Polls Predictions
Delhi Polls Exit Polls Predictions (GEtty Images)

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2025, 4:19 PM IST

Delhi Polls Exit Polls Predictions : ఏ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. సర్వే సంస్థలు విడుదల చేసే అంచనా ఫలితాలను చాలా మంది నమ్ముతుంటారు. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, వాస్తవిక ఎన్నికల ఫలితాలకు పెద్దగా తేడా ఉండదు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ లెక్కలు తప్పుతుంటాయి. కానీ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఫలితాల సరళి కనిపించింది.

ఆ సంస్థల లెక్క ఓకే
బీజేపీకి 40 నుంచి 55 సీట్లు రావచ్చని యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా వేసింది. ఆప్ 15 నుంచి 25 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ 1 సీటుకే పరిమితం కావచ్చని తెలిపింది. టుడేస్ చాణక్య సైతం అచ్చం ఇదే తరహా అంచనాలను వెలువరించింది. బీజేపీకి 51, ఆప్‌కు 19 సీట్లు రావొచ్చని జోస్యం చెప్పింది. చాణక్య స్ట్రాటజీస్ పేరుతో వెలువడిన నివేదికతో తమకు సంబంధం లేదని టుడేస్ చాణక్య స్పష్టం చేసింది. బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, ఆప్‌కు 32 నుంచి 37 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు రావొచ్చని మ్యాట్రిజ్ అంచనా వేసింది.

దీంతో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు అన్ని ఎగ్జిట్ పోల్స్ సరైన విధంగానే అంచనా వేశాయి. కౌంటింగ్​ మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాల తగ్గట్లే సరళి కనిపించింది. బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ 22 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ సున్నాకే పరిమితమైంది. దీంతో దిల్లీలోని సగానికిపైగా అసెంబ్లీ స్థానాలపై బీజేపీకి పట్టు పెరిగిందనే అంశం స్పష్టమైంది. పదేళ్లు దిల్లీని ఏలిన ఆప్ ప్రాభవాన్ని కోల్పోయిందని తేలిపోయింది. గతంలో దశాబ్దాల తరబడి దిల్లీని పాలించిన కాంగ్రెస్ దారుణంగా చతికిలపడింది.

2020 నుంచి ఇప్పటి వరకు!

  • 2020 సంవత్సరంలో దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. అప్పట్లో ఆప్ విజయాన్ని సరిగ్గానే అంచనా వేయగలిగారు. ఆనాడు ఏకంగా 62 అసెంబ్లీ సీట్లను గెల్చుకొని ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది.
  • 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పింది. దిల్లీలో ఆప్ కంటే బీజేపీ మెరుగ్గా రాణించింది. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎగ్జిట్ పోల్స్ కోసం శాంపిళ్ల సేకరణలో చేసిన తప్పిదం వల్లే అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ సరైన అంచనాకు రాలేకపోయాయి.


అయితే ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్నిసార్లు తప్పాయి. ఎప్పుడెప్పుడంటే?

  • హరియాణా, జమ్ముకశ్మీర్‌ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చతికిలపడ్డాయి.
  • ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కానీ చివరకు బీజేపీ విజయఢంకా మోగించింది.
  • లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కుపైగా సీట్లు వస్తాయని సర్వే సంస్థలు అంచనావేయగా, 240 స్థానాలే వచ్చాయి.
  • 2023లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల ఎగ్జిట్​ పోల్స్ లెక్క బెడిసికొట్టింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడతాయని అంచనా వేశాయి. కానీ ఆ రెండు రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచింది.
  • కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేయగా, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.
  • 2015లో బిహార్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, మహాకూటమికి మధ్య గట్టిపోటీ ఉంటుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఎన్నికల్లో కూటమికి 178 సీట్లు వచ్చాయి. బీజేపీ ఓటమి పాలైంది.

ABOUT THE AUTHOR

...view details