Delhi Rains :దేశ రాజధాని దిల్లీని శుక్రవారం కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాల వల్ల పలు ప్రాంతాల్లోకి వరదనీరు ఉప్పొంగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపైకి వరద నీరు రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాల వల్ల దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా, సఫ్దర్ జంగ్ వాతావరణ కేంద్రం 153.7 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదైనట్లు అంచనా వేసింది.
మెట్రో, రైల్వే స్టేషన్ లోకి వరద నీరు
నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందికరమైన మార్గాల వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. శాంతివన్ నుంచి ఐఎస్బీటీ వరకు ఔటర్ రింగ్ రోడ్డు రెండువైపులా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనువర్త మార్గంలో కూడా ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు, దిల్లీ రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల నీటిలో నడిచి వెళ్తున్నారు. దిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలోకి కూడా వరద నీరు చేరడం వల్ల అసౌకర్యానికి గురయ్యారు.
నిలిచిన విద్యుత్ సరఫరా
భారీ వర్షాల కారణంగా దిల్లీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ డిస్కమ్ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో కరెంట్ షాక్ ఘటనలు జరగకుండా ముందస్తుగా విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.